Mahaa Daily Exclusive

  తెలుగు రాష్ట్రాల మరోసారి భారీ అప్పులు…

Share

 

హైదరాబాద్, మహా.

ఆర్థిక అవసరాల నిమిత్తం తెలుగు రాష్ట్రాలు మరోమారు భారీగా అప్పులు చేసేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే వారం నిర్వహించనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెక్యూరిటీల వేలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాల్గొననున్నాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. మంగళవారం నాడు జరిగే ఈ వేలం ద్వారా రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం రూ.6,600 కోట్ల మేర నిధులను సమీకరించనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వేలం ద్వారా ఏకంగా రూ.4,600 కోట్ల అప్పు తీసుకోనుంది. ఇందులో 6 ఏళ్ల కాలపరిమితి బాండ్ల ద్వారా రూ.1,000 కోట్లు, పునఃజారీ సెక్యూరిటీల ద్వారా మరో రెండు విడతల్లో రూ.1,800 కోట్ల చొప్పున ఈ నిధులను ఏపీ సర్కారు సేకరించనుంది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా తన వ్యయాల నిమిత్తం రూ.2,000 కోట్ల మేర రుణం తీసుకోనుంది. మూడు వేర్వేరు పునఃజారీ బాండ్ల ద్వారా వరుసగా రూ.750 కోట్లు, రూ.500 కోట్లు, రూ.750 కోట్ల చొప్పున ఈ నిధులను తెలంగాణ సమీకరించుకోనుంది. ఆర్‌బీఐకి చెందిన ‘ఈ-కుబేర్’ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ వేలం ప్రక్రియ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మంగళవారం నాటి వేలంలో రూ.21,600 కోట్ల మేర బాండ్లను విక్రయానికి ఉంచడం గమనార్హం.