ఢిల్లీ, మహా.
దేశంలో చోటుచేసుకుంటున్న జనాభా మార్పులపై (డెమోగ్రాఫిక్ చేంజెస్) అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ విధివిధానాలు, తదుపరి చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ సరిహద్దులతో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో జనాభా గమనంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా పరిశీలించేందుకు ఈ కమిటీకి అవసరమైన అన్ని రకాల వసతులు, పరిపాలనాపరమైన, సాంకేతిక సహకారాన్ని అందించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది (2025) ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా చేసిన చారిత్రాత్మక ప్రకటనకు అనుగుణంగా, ఈ ఏడాది మే 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి కమిటీని అధికారికంగా పునరుద్ధరించి, ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీ, దేశవ్యాప్తంగా ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటున్న సున్నితమైన ప్రాంతాల్లో జనాభా పరంగా సంభవిస్తున్న మార్పులపై సమగ్రమైన అధ్యయనం చేయనుంది. కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాకుండా, దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు, పారిశ్రామిక పట్టణాల్లోనూ అంతర్గత వలసలు, జనాభా సమతుల్యతలో వస్తున్న మార్పులను ఈ కమిటీ ప్రత్యక్షంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలనలు జరపనుంది. ఇప్పటికే ఈ ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం విజయవంతంగా ముగిసిందని, కమిటీ యొక్క విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను (ఎజెండా) కూడా పక్కాగా రూపొందించుకున్నట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ కమిటీ నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా విజయవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ లాజిస్టికల్ మద్దతుతో పాటు అవసరమైన సర్వసహకారాలను నిరంతరాయంగా అందిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమత్వం, అంతర్గత సుస్థిరతపై జనాభా మార్పుల ప్రభావం ఏ మేరకు ఉందనే అంశాలపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక భవిష్యత్ వ్యూహాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన నివేదికలు, గణాంకాలను కమిటీకి సకాలంలో అందేలా సమన్వయం చేసుకోవాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు.








