Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌లో ‘ఆడియో’ కలకలం…..

Share

కాంగ్రెస్‌లో ‘ఆడియో’ కలకలం.
* సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వివాదాస్పద ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను కలకలం రేగింది. ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్ఠానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న అభియోగాలపై ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ ద్వారా ఆయనకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై.. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై షబ్బీర్ అలీ అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆ వైరల్ ఆడియో ద్వారా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఈ ఆడియో క్లిప్‌పై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సీనియర్ నేతగా ఉండి సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినే లక్ష్యంగా చేసుకుని, పైగా మహిళల పట్ల అవమానకర రీతిలో మాట్లాడటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అధిష్ఠానం భావించింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించడమే కాకుండా, అంతర్గత వ్యవహారాలను, విభేదాలను బహిరంగ చర్చకు తీసుకురావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన నాయకుడిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమేనని స్పష్టం చేస్తూ, ఈ ఆడియో వ్యవహారంపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు పంపింది. సీనియర్ నేత వ్యవహార శైలిపై పార్టీ తీసుకున్న ఈ చర్య ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.