Mahaa Daily Exclusive

  నారాసురుడి’ నిజరూపం బట్టబయలు….

Share

  • నారాసురుడి’ నిజరూపం బట్టబయలు.
  • అక్కచెల్లెమ్మల గొంతు కోసిన కూటమి సర్కారు.
  • సూపర్ సిక్స్ శూన్యం.. ఉద్యోగాలు ఏవి?.
  • అమరావతి భ్రమలు – అమలుకాని హామీలు.
  • అమలాపురం సాక్షిగా చంద్రబాబు తీరుపై రజిని ఫైర్

అమలాపురం, మహా.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలం వంచన, కుట్రలు, వెన్నుపోట్లకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు విడదల రజిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు మహిళా సాధికారత పేరిట ఊరూరా తిరిగి మాయమాటలు చెప్పిన నాయకులు, నేడు అదే అక్కచెల్లెమ్మల గొంతును తడిగుడ్డతో నులుముతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం విజయాలు చెప్పుకుంటుండగా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ.. ఆడబిడ్డ నిధి నుంచి సూపర్ సిక్స్ వరకు కూటమి సర్కారు చేసిన మోసాలను ఎండగడుతూ ఆమె సమగ్ర చార్జిషీట్‌ను విడుదల చేశారు.

 

**ఆడబిడ్డలకు అన్యాయం.. దేవుడి సాక్షిగా మోసం**

ఎన్నికల వేళ ఊరూరా తిరిగి ప్రతి ఇంటికీ పథకాల లెక్కలు చెప్పి, సంతకాలు పెట్టి బాండ్లు జారీ చేసిన నాయకులు ఇప్పుడు ఆ మాటలు మర్చిపోయారని రజిని మండిపడ్డారు. పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళకు ప్రతినెలా పదిహేనొందల రూపాయల చొప్పున ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని నమ్మించి, తీరా ఓట్లు వేయించుకున్నాక ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయలేమని చేతులెత్తేయడం మహిళలకు నిట్టనిలువునా వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి పాదాల సాక్షిగా మహిళలను మోసం చేసిన కూటమి నేతలు, తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను నాశనం చేసే రాజకీయ గుంటనక్కలమని, నికార్సైన తోడేళ్లమని పాలకులే తమ చేతలతో ఒప్పేసుకుంటున్నారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘నారాసురుడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

**కాగితాలకే పరిమితమైన సూపర్ సిక్స్.. యువతకు నిరాశ**

ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయంగా ప్రచారం చేసిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, యువతకు ఉపాధి వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విడదల రజిని విమర్శించారు. బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల కోట్లకు పైగా, అన్నదాత సుఖీభవకు ఆరు వేల కోట్లకు పైగా కేటాయించామని చెబుతున్నా, ఆచరణలో అవి ప్రజలకు ఏకకాలంలో, పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. నాలుగేళ్లలో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టి అంటూ ముఖ్యమంత్రి చెబుతున్న మాటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని ఆరోపించారు. కాబినెట్ ఆమోదం తెలిపిన పెట్టుబడులకు, వాస్తవంగా రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలకు ఎక్కడా పొంతన లేదని, అసలు ఇప్పటివరకు ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

**ఆర్థిక విధ్వంసం.. క్షీణించిన శాంతిభద్రతలు**

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా రజిని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంపై పది లక్షల కోట్ల రూపాయల భారం ఉందని చెబుతుండగా, కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు ఐదున్నర లక్షల కోట్లు దాటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు ఏభై వేల కోట్లు దాటుతుందన్న అంచనాలున్నాయని, అప్పులు ఈ స్థాయిలో పెరుగుతున్నా ప్రజలకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలు మాత్రం అందడం లేదని ఆమె విమర్శించారు. మరోవైపు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, మహిళలు, చిన్నారులపై దాడులు, నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా రాజకీయ ఒత్తిళ్లకు గురిచేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అటు అన్నదాతల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని, గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందక రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

**అమరావతి ఆర్భాటాలు.. బడ్జెట్ అంకెల గారడీ**

కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి పేరుతోనే గొప్పలు చెప్పుకుంటోందని, రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుడికి ఉపయోగపడే అభివృద్ధి ఎక్కడా జరగలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి అమరావతిలో సచివాలయం, నివాస సముదాయాల కోసం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం లభించినా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది ఏమాత్రం సరిపోదని వారు వాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల భారీ బడ్జెట్‌లో కీలక రంగాలకు పెద్దపీట వేసినట్లు కాగితాలపై చూపించారని విమర్శించారు. జలవనరుల శాఖకు పద్దెనిమిది వేలకు పైగా కోట్లు, ఇంధన రంగానికి పదమూడు వేల కోట్లు, రోడ్లు మరియు భవనాలకు ఎనిమిది వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల ఏడు వందల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే, ఈ భారీ కేటాయింపులు కేవలం అంకెలకే పరిమితమయ్యాయా లేక క్షేత్రస్థాయిలో ప్రజల కోసం నిజంగానే ఖర్చయ్యాయా అని ప్రతిపక్షం నిలదీస్తోంది.

**రాజకీయ పోరుకు పునాది**

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండేళ్ల పాలనా కాలం అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వైఎస్సార్సీపీ ‘రెండేళ్ల వైఫల్యాలు’ పేరిట ప్రభుత్వ లోపాలను, నెరవేరని సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అధికార కూటమి మాత్రం ‘రెండేళ్ల పునర్నిర్మాణం’ అనే నినాదంతో పారిశ్రామిక ప్రగతి, రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధిని తమ ఘన విజయాలుగా ప్రచారం చేసుకుంటోంది. పాలకుల వంచనను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతామని విడదల రజిని స్పష్టం చేయడంతో, రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సమరం మరింత ఉధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.