కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై సంస్కృతం తప్పనిసరి.
* 6, 9 తరగతుల్లో నూతన విధానం.
* ఆ రెండు తరగతులకు కనీసం ఒక సంస్కృత సెక్షన్ ఉండాల్సిందే!
* మూడో భాషగా సంస్కృతం లేదా ప్రాంతీయ భాష.
ఢిల్లీ, మహా.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలులో భాగంగా విద్యావ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) భాషా బోధనపై అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో కనీసం ఒక సంస్కృత సెక్షన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు మూడో భాషగా సంస్కృతం లేదా ప్రాంతీయ భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా బదిలీ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మూడో భాషా విధానానికి (ఆర్3) సంబంధించి కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) కూడా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
**మూడో భాషగా సంస్కృతం లేదా ప్రాంతీయ భాష**
నూతన విద్యా విధానం ప్రకారం విద్యార్థులు మొదటి భాషగా హిందీ, రెండో భాషగా ఇంగ్లీష్‌ను అభ్యసిస్తారు. వీటికి భిన్నంగా మూడో భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు మూడో భాషగా సంస్కృతం లేదా తమ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాషను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఎంచుకునే భాష రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ భాషల జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. ఈ ఎంపికలకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ ప్రక్రియను అన్ని పాఠశాలలు ముందే పూర్తి చేయాలని కేవీఎస్ సూచించింది. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగానే ఈ ఎంపికలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
**సంస్కృత సెక్షన్ ఎందుకు తప్పనిసరి?**
విద్యార్థులకు ప్రాంతీయ భాషలను ఎంచుకునే అవకాశం ఇచ్చినప్పటికీ, కేంద్రీయ విద్యాలయాల్లో చదివే వారిలో ఎక్కువ మంది దేశవ్యాప్తంగా తరచూ బదిలీలు అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉంటారు. వీరు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఆయా ప్రాంతీయ భాషలు నేర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారి విద్యాభ్యాసానికి ఎలాంటి విఘాతం కలగకుండా దేశవ్యాప్తంగా ఏకరూపత ఉండేలా ప్రతి కేంద్రీయ విద్యాలయంలో కనీసం ఒక సంస్కృత సెక్షన్‌ను తప్పనిసరి చేశారు. ఈ మేరకు విద్యార్థులు మూడో భాషగా దేనిని ఎంచుకున్నారనే వివరాలను ‘సమాగమ్’ పోర్టల్‌లో నమోదు చేయాలని, తద్వారా ఉపాధ్యాయుల అవసరాన్ని అంచనా వేయవచ్చని కేవీఎస్ ఆదేశించింది.
**పాఠశాలల్లో సెక్షన్ల విభజన ఇలా**
కొత్త విధానం ప్రకారం కేంద్రీయ విద్యాలయాల్లో సెక్షన్ల ఏర్పాటుపై కేవీఎస్ స్పష్టమైన ఉదాహరణలు ఇచ్చింది. ఒకే సెక్షన్ ఉన్న పాఠశాలల్లో సంస్కృతం, ప్రాంతీయ భాషలకు వేర్వేరు బ్యాచ్‌లను ఏర్పాటు చేయవచ్చు. అయితే, ప్రతి బ్యాచ్‌లో కనీసం పదిహేను మంది విద్యార్థులు ఉండాలి. ఇక రెండు సెక్షన్లు ఉన్న పాఠశాలల్లో ఒక సెక్షన్‌ను పూర్తిగా సంస్కృతానికి, మరో సెక్షన్‌ను ప్రాంతీయ భాషకు కేటాయించవచ్చు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సెక్షన్లు ఉన్నట్లయితే, విద్యార్థుల ఎంపికల సంఖ్యను బట్టి ప్రధానోపాధ్యాయులు స్వయంగా సెక్షన్ల పంపిణీపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఎలా చూసుకున్నా ప్రతి తరగతిలో కనీసం ఒక సంస్కృత సెక్షన్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
**సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. టెన్త్‌లో పరీక్షకు మినహాయింపు**
భాషా బోధనకు సంబంధించి సీబీఎస్‌ఈ కూడా కీలక మార్పులు చేసింది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల అధ్యయనాన్ని తప్పనిసరి చేస్తూ జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు అనుగుణంగా జులై 1 నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తేనుంది. దీని ప్రకారం విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలను తప్పనిసరిగా అభ్యసించాలి. అయితే, మూడో భాష విషయంలో విద్యార్థులపై ఎలాంటి అదనపు ఒత్తిడి లేకుండా ఉండేందుకు పదో తరగతి బోర్డు పరీక్షల్లో మూడో భాషకు ప్రత్యేక పరీక్ష నిర్వహించబోమని ప్రకటించింది. కేవలం భాషను నేర్చుకోవడంపైనే ఆసక్తి పెంచేలా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మూడో భాషకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు వచ్చే వరకు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎనిమిదో తరగతి పుస్తకాలనే ఉపయోగించుకోవచ్చని సూచించింది.








