సింగరేణిలో రూ.1,600 కోట్ల బొగ్గు మాయం..!
*అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి.
*సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన సింగరేణి (ఎస్‌సీసీఎల్) సంస్థలో చోటుచేసుకున్నాయంటున్న అవకతవకలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందంటూ వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని ఆయన కోరారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడంతో పాటు, సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రికి కిషన్‌రెడ్డి తాజాగా ఒక లేఖ రాశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్న సింగరేణి సంస్థ తెలంగాణకే కాకుండా దేశ ఇంధన భద్రతలోనూ కీలక పాత్ర పోషిస్తోందని కిషన్‌రెడ్డి తన లేఖలో గుర్తుచేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిరంతర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. అయితే, ఇటీవల పత్రికల్లో సింగరేణిలో భారీగా అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు పక్కదారి పట్టిందని వచ్చిన కథనాలు కలవరపెడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి చెల్లించాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉందని, ఈ తాజా బొగ్గు మాయం వార్తలు సంస్థ మనుగడను, భవిష్యత్ అభివృద్ధిని మరింతగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
సింగరేణి ప్రయోజనాలను కాపాడేందుకు, ఆరోపణల్లోని వాస్తవాలను బయటపెట్టేందుకు తక్షణమే విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రిని కేంద్రమంత్రి కోరారు. అలాగే, సంస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు తగిన సేఫ్‌గార్డ్స్, పటిష్టమైన ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మానిటరింగ్ టూల్స్ వినియోగించడం ద్వారా, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ద్వారా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించవచ్చని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి కుంభకోణాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, అలాగే సంస్థ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.








