Mahaa Daily Exclusive

  ఢిల్లీ వేదికగా నేడు జనసేన అగ్రనేతల విస్తృత స్థాయి సమావేశం….

Share

ఢిల్లీ వేదికగా నేడు జనసేన అగ్రనేతల విస్తృత స్థాయి సమావేశం.

* సేన ప్రస్థానం… జాతీయ సమైక్యత కోసం’ శీర్షికతో సదస్సు.

* పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

అమరావతి, మహా.

జనసేన పార్టీ శ్రేణుల్లో సరికొత్త సిద్ధాంత స్పృహను, జాతీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీలో నేడు (సోమవారం) ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరగనున్న ఈ సదస్సుకు “సేన ప్రస్థానం… జాతీయ సమైక్యత కోసం” అనే శీర్షికను ఖరారు చేశారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం అనే అద్భుత సిద్ధాంతాల పునాదులపై ఏర్పడిన జనసేన పార్టీ.. జాతీయ సమగ్రత దృక్పథంతో ఈ కీలక భేటీని నిర్వహిస్తోంది. దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక అశోక హోటల్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానున్న ఈ సమావేశం సాయంత్రం వరకు సుదీర్ఘంగా సాగనుంది.

జనసేన పార్టీని స్థాపించి విజయవంతంగా పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పన్నెండేళ్ల కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, దేశ సమగ్రతపై జనసేన ఎటువంటి ఉన్నతమైన భావజాలంతో ముందుకు సాగుతోందనే విషయాలను పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా వివరించనున్నారు. ప్రాంతీయ అకాంక్షలకు సముచిత విలువ ఇస్తూనే, జాతీయ సమగ్రత కోసం ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఎలా నిలబడాలనే అంశంపై ఆయన మాట్లాడనున్నారు. వర్తమాన దేశ రాజకీయ పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల ప్రజలంతా సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతో పాటు, భవిష్యత్ జాతీయ రాజకీయాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ జాతీయ స్థాయి సమావేశానికి జనసేన తరఫున నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు), శాసనమండలి సభ్యులతో (ఎమ్మెల్సీలు) పాటు ఇటీవల నామినేట్ అయిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నేతలతో పాటు తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు, అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల జనసేన పార్టీలో చేరిన పలువురు ప్రముఖులను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దేశ రాజధాని వేదికగా దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులందరితో కలిసి నిర్వహిస్తున్న ఈ భారీ సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జనసేన అగ్రనాయకత్వం ఢిల్లీలో ఇప్పటికే పకడ్బందీగా పూర్తి చేసింది.