సొంత పార్టీ నేతకే సీఎం రేవంత్ వెన్నుపోటు.
* మీనాక్షి నటరాజన్‌పై కుట్ర: కేటీఆర్.
* రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారని సంచలన ఆరోపణ.
* అవినీతిపై ఫిర్యాదు చేసినందుకే తప్పుడు కేసులు బనాయించి వేధింపులు.
* కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా.. హామీల అమలులో ఘోర వైఫల్యం.
* ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయం.. ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమెపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, ఏకంగా తప్పుడు కేసులు బనాయించి వేధించారని విమర్శించారు. అంతేకాకుండా, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మీనాక్షికి రాజ్యసభ సీటు దక్కకుండా అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి నేరుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కుమ్మక్కయ్యారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్న అవినీతి, చీకటి భూ ఒప్పందాలాగోటాలాలపై మీనాక్షి నటరాజన్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని, ఆ కక్షతోనే ప్రతీకారంగా హైదరాబాద్‌లో ఆమెపై రేవంత్ తప్పుడు కేసు పెట్టించారని కేటీఆర్ ఆరోపించారు. సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచే నైజం రేవంత్ రెడ్డికి పుట్టుకతోనే వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, చరిత్ర హీనుడైన నియంత హిట్లర్ తనకు ఆదర్శం అని బహిరంగంగా చెప్పుకోవడం అత్యంత సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల పాలనను ‘అట్టర్ ఫ్లాప్ సినిమా’గా కేటీఆర్ అభివర్ణించారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాయమాటలు ఏమయ్యాయని, కనీసం 4,000 ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని నిలదీశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని కాంగ్రెస్ నేతలు ఆధారాలతో నిరూపిస్తే.. తాను తక్షణమే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు.
త్వరలోనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక రావడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడమే ఈ ఉపఎన్నికకు కారణమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని, రాబోయే రోజుల్లో ప్రతి బూత్ స్థాయిలో పటిష్టంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ 25వ తేదీ నుంచి ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కార్యకర్తలంతా అత్యంత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సైతం రికార్డు స్థాయిలో చేపట్టి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.








