వర్షాలు, విపత్తులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.
* విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.
* ప్రాజెక్టుల నిర్వహణ ఖచ్చితంగా మాన్యువల్ ప్రకారమే జరగాలి.
* అనుమతి లేకుండా క్షేత్రస్థాయిని వదిలితే సహించేది లేదు: ఇంజినీర్లకు హెచ్చరిక.
*జూన్ 9 వానల సమయంలో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసహనం.
* ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే బాధ్యులపై చర్యలు.. ఖాళీల భర్తీకి తక్షణ ఆదేశం.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు, ప్రకృతి విపత్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను గట్టిగా హెచ్చరించారు. వర్షాలు, ముందస్తు జాగ్రత్తలపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టుల నిర్వహణ అంతా ఖచ్చితంగా నిర్దేశిత మాన్యువల్ ప్రకారమే జరగాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల పరిధిలోని చీఫ్ ఇంజినీర్లు (CEs), సూపరింటెండింగ్ ఇంజినీర్లు (SEs) ఈ వర్షాకాలం సీజన్ మొత్తం విధిగా స్థానికంగానే అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్క ఇంజినీర్ కూడా ప్రాజెక్టులను వదిలి వెళ్లకూడదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణతో పాటు అత్యవసరంగా గేట్ల మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేస్తోందని వెల్లడించారు. నీటిపారుదల శాఖ, మెట్రో వాటర్ బోర్డ్, ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా) విభాగాలు ఒకదానితో ఒకటి నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
సమావేశంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీనే తాము ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించి వర్షాలపై అవసరమైన సమాచారం అందించినప్పటికీ, జూన్ 9న కురిసిన వానల సమయంలో క్షేత్రస్థాయిలో అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీరు నిలిచే (క్యూర్) ప్రాంతాల్లో మున్సిపల్, పోలీస్ అధికారుల మధ్య కనీస సమన్వయం లోపించిందని తప్పుబట్టారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో నీరు నిలిచే ప్రాంతాలు (వాటర్ లాగింగ్ పాయింట్లు), బ్లాక్ స్పాట్లు, తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా వర్షాల సమయంలో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలన్నారు.
“వర్షం కురుస్తున్న సమయంలో ట్రాఫిక్ విభాగానికి చెందిన ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపై, క్షేత్రస్థాయిలోనే ఉండాలి. అవసరమైతే నేనే స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితులను పరిశీలిస్తాను. వర్షాల వల్ల ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయి. మానవ తప్పిదాల వల్ల సామాన్య ప్రజలకు సమస్యలు వస్తే ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి వీలుగా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.








