కృష్ణా నదిలో ఘోర విషాదం.. పడవ బోల్తాపడి నలుగురు మృతి.
* సెలవులు ముగియడంతో తాతగారింటికి వచ్చిన మనవళ్లు, మనవరాళ్లు.
* విహారయాత్రలో ఊహించని మృత్యుపాశం.. విషాదంలో కోనూరు గ్రామం.
* కళ్లెదుటే నీట మునిగిన చిన్నారులు.. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు.
అచ్చంపేట , మహా.
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు వద్ద కృష్ణా నదిలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని నదికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పడవ బోల్తా పడి ప్రాణాలు కోల్పోయారు. తాత మనవళ్లు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బావ మరదళ్లు, చిన్నారుల పలకరింపులతో అప్పటివరకు సంతోషం నిండిన ఆ ఇంట్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. వేసవి సెలవులు ముగియడం, సోమవారం నుంచి పాఠశాలలు పూర్తిగా తెరుచుకుంటుండటంతో ఆఖరి ఆదివారం కుటుంబమంతా కలిసి ఆనందంగా గడపాలని భావించిన ఆ బంధువుల ఆశలు కృష్ణా నది గర్భంలో కలిసిపోయాయి.
కోనూరుకు చెందిన గంధం గంగయ్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు కాగా, కుమారుడికి ఇద్దరు, కుమార్తెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవుల కోసం పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి తాతగారింటికి వచ్చారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంతా కలిసి ఇంట్లోనే కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. సాయంత్రం వేళ సరదాగా సమీపంలోని కృష్ణా నది తీరానికి వెళ్లారు. అక్కడ నీటిని చూసిన పిల్లలు, నదికి అవతల ఒడ్డుకు వెళ్దామని పట్టుబట్టారు. దీంతో మొత్తం తొమ్మిది మంది ఒక నాటు పడవలో నదిలోకి ప్రయాణం ప్రారంభించారు. అంతా కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకున్నారు. అయితే, పడవ నుంచి దిగే క్రమంలో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఒకే వైపుకు రావడంతో పడవ అదుపుతప్పి నీటిలో బోల్తా పడింది.
ఈ ఊహించని ఘటనతో పడవలో ఉన్న తొమ్మిది మంది నీటిలో మునిగిపోయారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై తమ ప్రాణాలకు తెగించి ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ, మిగిలిన నలుగురు మాత్రం నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర శ్రమ అనంతరం ముందుగా మూడు మృతదేహాలను, ఆ తర్వాత మరొక యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతులను గంధం సంధ్య, గంధం సైనీ, బత్తుల కార్తీక్, కొనత చైతన్యలుగా గుర్తించారు. వీరు చిలకలూరిపేట, మర్రిచెట్టు పాలెం, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన వారుగా నిర్ధారించారు.
అప్పటివరకు తమ కళ్లెదుటే ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గంగయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. తమ కళ్ల ముందే పిల్లలు నీటిలో మునిగిపోతుంటే కాపాడుకోలేకపోయామన్న బంధువుల ఆవేదన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పరిమితికి మించి నాటు పడవలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించారు.
“మృతుల్లో ఒకరిది చిలకలూరిపేట, మరొకరిది మర్రిచెట్టు పాలెం, మరో ఇద్దరు పిడుగురాళ్లలో ఉంటున్నారు. నదిని చూసి వెళదామని ఇక్కడికి వచ్చారు. అంతా కలిసి పడవపై నదిలోకి వెళ్లారు. ఏం జరిగిందో తెలియదు కాసేపటికి పడవ తిరగబడింది. వారంతా చేతులెత్తి రక్షించమని అరుస్తున్నారు. ఆ సమయానికి నా భర్త వెంటనే స్పందించి నీళ్లలోకి వెళ్లి ఐదుగురిని కాపాడారు. కానీ అదే సమయానికి మిగతా నలుగురు నీటిలో మునిగిపోయారు.” అని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై మరింత లోతైన విచారణ చేపట్టారు. సెలవుల వేళ జరిగిన ఈ ఘోర ప్రమాదంతో కోనూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.








