ఎయిర్‌పోర్టుకు ఇక రయ్.. రయ్.
* జీవీకే వన్ మాల్ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు సరికొత్త ఫ్లైఓవర్.
*నాలుగు కిలోమీటర్ల మేర భారీ నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు.
* క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం.. రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు.
* రూ.14.6 కోట్లతో బేగంపేట పైవంతెనకు మహర్దశ.. టెండర్లు జారీ.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన కారిడార్ల అభివృద్ధిలో భాగంగా నగర నడిబొడ్డు నుంచి ఎయిర్‌పోర్టుకు సాఫీగా ప్రయాణం సాగేలా మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని జీవీకే వన్ మాల్ నుంచి ప్రారంభమై మాసబ్‌ట్యాంక్ మీదుగా నేరుగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానించేలా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఈ పైవంతెనను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, రానున్న రెండేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రధాన నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులో ఉన్నప్పటికీ.. అక్కడి వరకు చేరుకోవడమే వాహనదారులకు నరకప్రాయంగా మారుతోంది. రద్దీ వేళల్లో బంజారాహిల్స్ రోడ్డు నంబరు-1 నుంచి జీవీకే మాల్, తాజ్‌కృష్ణ, కేర్ ఆస్పత్రి, మాసబ్‌ట్యాంక్ జంక్షన్‌ను దాటి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు వెళ్లాలంటే వాహనాలకు కొన్నిసార్లు గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు శాశ్వతంగా తొలగిపోనున్నాయి.
బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ వద్ద ఈ కొత్త ఫ్లైఓవర్ ప్రారంభమై మాసబ్‌ట్యాంక్ సర్కిల్ వద్ద ఉన్న ప్రస్తుత పైవంతెన పక్క నుంచి వెళుతూ సరిగ్గా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర కిందకు దిగుతుంది. దీనివల్ల బేగంపేట వైపు నుంచి వచ్చే ప్రయాణికులు పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా నేరుగా ఈ జీవీకే ఫ్లైఓవర్ ఎక్కి, ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ఆరాంఘర్ జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారికి చేరుకోవచ్చు. విమానాశ్రయం నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10, 12కు సులభంగా వెళ్లేందుకు వీలుగా రోడ్డు నంబర్-12 ప్రాంతంలో ఒక డౌన్ ర్యాంపును నిర్మించనున్నారు. అలాగే, ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు చింతల్‌బస్తీ మీదుగా రోడ్డు నంబర్-12 వైపు సాఫీగా వెళ్లేలా చింతల్‌బస్తీ జంక్షన్ వద్ద ప్రధాన పైవంతెన కింద నుంచి మరో చిన్న పైవంతెనను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్ జంక్షన్ల నుంచి వచ్చే వాహనాలు ఈ కొత్త ఫ్లైఓవర్ పైకి ఎక్కేందుకు వీలుగా ఎన్ఎండీసీ కార్యాలయం ముందు ఒక అప్ ర్యాంపును సైతం ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన దశలో ఉందని హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ తెలిపారు. ఇది పూర్తయిన తర్వాత భూసేకరణ, ప్రాజెక్టు అంచనా వ్యయం తదితర కీలక అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. ఈ పైవంతెన నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడమే కాకుండా, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు బేగంపేట ఫ్లైఓవర్‌కు సైతం మంచి రోజులు రాబోతున్నాయి. దెబ్బతిన్న రోడ్లు, భారీ ట్రాఫిక్ కారణంగా ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో రూ.14.6 కోట్ల వ్యయంతో ఈ పైవంతెనకు సమగ్ర మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పనులు వెంటనే ప్రారంభించేందుకు ప్రాజెక్టుల విభాగం టెండర్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. దీనితో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఆర్.కె.పురం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) మరమ్మతు పనులకు సైతం అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పనులన్నింటినీ రానున్న ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు జరిగే సమయంలో వంతెనలపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లింపు చర్యలు చేపట్టనున్నారు.








