Mahaa Daily Exclusive

  టీఎంసీ ముసలం.. ఎన్డీఏకు బలం!

Share

టీఎంసీ ముసలం.. ఎన్డీఏకు బలం!

* పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా అడుగులు.

* రాజ్యసభలో 163 మార్కుకు చేరువలో అధికార కూటమి.

* నేడు స్పీకర్‌ను కలవనున్న 20 మంది తృణమూల్‌ తిరుగుబాటు ఎంపీలు.

* లోక్‌సభలో పెరగనున్న బలం.. అయినా మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరమే.

ఢిల్లీ, మహా.

పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో రేగిన అంతర్గత తిరుగుబాటు.. కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికి పార్లమెంట్‌లో రాజకీయంగా కలిసిరానుంది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ఉభయ సభల్లోనూ సొంతంగా ఆమోదించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3) ప్రత్యేక మెజారిటీని సాధించే దిశగా ఎన్డీఏ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన వివిధ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలు, టీఎంసీ ఎంపీల రాజీనామాలతో ఎగువ సభలో ఎన్డీఏ బలం గణనీయంగా పెరిగి ఆ మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత చేరువైంది. అయితే, దిగువ సభ అయిన లోక్‌సభలో మాత్రం ఆ ప్రత్యేక మెజారిటీ మార్కుకు ఎన్డీఏ కూటమి ఇంకా కొంత దూరంలోనే నిలిచింది.

**రాజ్యసభలో సులభతరం**

ఉభయ సభల్లోనూ తిరుగులేని బలాన్ని ప్రదర్శించాలని భావిస్తున్న ఎన్డీఏకు టీఎంసీ లొల్లి పెద్ద ఊరటనిచ్చేలా ఉంది. ఎగువ సభలో ప్రస్తుతం ఎన్డీఏ బలం 148గా ఉండగా.. జార్ఖండ్, మిజోరాంలలోని స్వతంత్ర స్థానాల ఎన్నికల ద్వారా మరో మూడు సీట్లు కూటమి ఖాతాలో చేరనున్నాయి. వీటికి తోడు, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడంతో, బెంగాల్‌లో జరగబోయే ఉపఎన్నికల తర్వాత ఆ మూడు స్థానాలనూ ఎన్డీఏనే కైవసం చేసుకోనుంది. దీంతో పెద్దల సభలో ఎన్డీఏ బలం 154కి చేరనుంది. రాజ్యసభలో 2/3 మెజారిటీ సాధించాలంటే 163 స్థానాలు అవసరం కాగా.. కూటమి ఈ మార్కుకు కేవలం 9 స్థానాల దూరంలోనే నిలుస్తుంది. రానున్న రోజుల్లో మమతా బెనర్జీపై అసంతృప్తితో ఉన్న మరో 20 మంది వరకు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎన్డీఏ సులభంగానే 163 మార్కును దాటి, కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సొంతం చేసుకోనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బలం ఎగువ సభలో క్రమంగా క్షీణిస్తోంది. డీఎంకేకు చెందిన 8 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ముగ్గురు ఎంపీలు కూటమికి దూరం కావడంతో ప్రస్తుతం ‘ఇండియా’ బలం 64కి పడిపోయింది. సభలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 7 సీట్లు, బిజూ జనతా దళ్ (బీజేడీ)కు 6 సీట్లు ఉన్నాయి. ఎండీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు బిల్లుల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ఏడాది నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ బలం పెరిగిన దృష్ట్యా అక్కడ కొన్ని స్థానాలను ఎన్డీఏ కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.

**లోక్‌సభలో మెజారిటీ కష్టమే!**

దిగువ సభలో రాజ్యాంగ సవరణలకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అందుకోవడం ఎన్డీఏకు కొంత సంక్లిష్టంగానే కనిపిస్తోంది. లోక్‌సభలో ఈ ప్రత్యేక మెజారిటీ సాధించాలంటే కనీసం 363 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన దాదాపు 20 మంది ఎంపీలు ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడి ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వీరంతా సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము టీఎంసీ నుంచి విడిపోతున్నట్లు అధికారిక లేఖను అందజేయనున్నారు. ఈ తిరుగుబాటు ఎంపీల మద్దతు కలిపినా లోక్‌సభలో ఎన్డీఏ బలం 313కే చేరనుంది. ఫలితంగా, రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన 363 మార్కును చేరుకోవడానికి ఎన్డీఏ ఇంకా 50 స్థానాల దూరంలో ఉండిపోనుంది.

**ప్రత్యేక బిల్లుల ఆమోదం ఎలా?**

రాబోయే వర్షాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి ప్రత్యేక మెజారిటీ నిబంధనలు అడ్డంకిగా మారనున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. ఓటింగ్ జరిగే సమయంలో సభలోని మొత్తం సభ్యులలో కనీసం సగం మంది హాజరు కావాల్సి ఉంటుంది. అలా హాజరై ఓటు వేసిన వారిలో మూడింట రెండు వంతుల మంది మద్దతు ఇస్తేనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. గత ఏప్రిల్‌లో జరిగిన ఒక ఓటింగ్ సమయాన్ని పరిశీలిస్తే.. అప్పట్లో 528 మంది ఎంపీలు సభకు హాజరయ్యారు. ఆ లెక్కన 2/3 మెజారిటీకి 352 ఓట్లు అవసరమవ్వగా.. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో అవసరమైన సంఖ్యాబలం లేక ఆ బిల్లు 54 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఒకవేళ రాబోయే రోజుల్లో ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ ఈ 2/3 మెజారిటీని సాధించగలిగితే, తాము అనుకున్న కీలక బిల్లులను ఎక్కడా బ్రేక్ పడకుండా సులువుగా పాస్ చేయించుకోగలుగుతుంది. మరి రానున్న రోజుల్లో పార్లమెంట్‌లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారనున్నాయో వేచి చూడాలి.