రాహుల్ గాంధీ ఊహాజనిత భయాలు సృష్టిస్తున్నారు.
* కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
* ప్రధాని మోదీని విమర్శించే నెపంతో దేశ ప్రజల విజయాలను తక్కువ చేస్తున్నారు.
* పెద్ద విపత్తు రాబోతోందంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం సరికాదు.
* సవాళ్లు ఉన్నా సమర్థంగా అధిగమించాం.. 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి.
* బెంగళూరులో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప’ సదస్సులో ఆర్థిక మంత్రి ఫైర్.
ఢిల్లీ, మహా.
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడమే పరమావధిగా పెట్టుకున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఆ క్రమంలో దేశ ప్రజలు సాధించిన చారిత్రక విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఎలాంటి సంక్షోభం లేకపోయినా, రాహుల్ గాంధీ తన సొంత ఊహలతో ప్రజల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం బెంగళూరులో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప’ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత మాట్లాడిన ప్రతిసారీ దేశంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయినట్లు చిత్రీకరించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారి, పశ్చిమాసియా సంక్షోభం వంటి ఎన్నో అంతర్జాతీయ సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, అయితే రాహుల్ మాత్రం వీటిని కావాలనే విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు.
భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని కేవలం తమ ప్రభుత్వం మాత్రమే చెప్పడం లేదని, జీడీపీ గణాంకాలతో పాటు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. పశ్చిమాసియా సంక్షేమ దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా ముడిచమురు, ఎల్పీజీ ధరల హెచ్చుతగ్గులతో పాటు అంతర్జాతీయ షిప్పింగ్ (సరకు రవాణా) రంగానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని వివరించారు. యుద్ధ ప్రాంతాల గుండా ఓడలను పంపడానికి రవాణా కంపెనీలు వెనుకాడటం, దాడుల భయంతో ఇన్సూరెన్స్ ప్రీమియంలు, బీమా ఖర్చులు గణనీయంగా పెరిగినప్పటికీ.. ప్రధాని మోదీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల వల్ల మన దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగలేదన్నారు. పెరిగిన భారీ ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించి ప్రజలపై భారం పడకుండా చూసిందని, కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నేతకు ఇవేవీ పట్టడం లేదని, దేశం ఇబ్బందుల్లో ఉందనే తప్పుడు భావనను ప్రజల్లో కల్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్ల పాలన అంతా అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సాగిందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ హయాంలోనే దేశంలో పేదరికం రికార్డు స్థాయిలో తగ్గిందని, ఇంటింటికీ తాగునీరు, పారిశుద్ధ్యం, ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, ఆహార భద్రత వంటి కార్యక్రమాలను ప్రజల చెంతకు చేర్చామని తెలిపారు. మోదీ పాలనాకాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ఆమె వెల్లడించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలో తీవ్రమైన పేదరికం 29.17 శాతంగా ఉండగా, అది ఇప్పుడు 11.28 శాతానికి పడిపోయిందని గణాంకాలతో సహా వివరించారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద దేశంలో 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించి, నూటికి నూరు శాతం కవరేజీ సాధించామని చెప్పారు.
సాంకేతిక రంగంలో భారత్ సాధించిన ప్రగతిని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ ఆధారంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారీగా అభివృద్ధి చేశామన్నారు. దీనివల్ల నేడు దేశంలో 58 కోట్ల జన్ ధన్ ఖాతాలు, 144 కోట్ల ఆధార్ గుర్తింపు కార్డులు, 125 కోట్ల మొబైల్ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. మన దేశానికి చెందిన యూపీఐ డిజిటల్ లావాదేవీల వ్యవస్థ నేడు ప్రపంచస్థాయికే ఒక నమూనాగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘విజన్ 2047’ లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఘనతను సాధించడానికి మనకు ఇంకా 21 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఇది సుదూరంగా కనిపించినప్పటికీ దీనిని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అనే గొప్ప స్ఫూర్తితో 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.








