Mahaa Daily Exclusive

  అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ‘సిట్’ విచారణ…

Share

అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ‘సిట్’ విచారణ.

* ఆవు పేడ కుప్పలో రూ.10 లక్షలు లభ్యం!

* ట్రస్ట్ సిఫార్సుతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కార్.

* ఆలయ ఉద్యోగి నివాసంలో పోలీసుల ముమ్మర సోదాలు.. లఖ్‌నవూ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో విచారణ.

* రూ.7 కోట్ల గోల్‌మాల్ జరిగిందన్న మాజీ అకౌంట్స్ ఆఫీసర్.. ఆరోపణలను కొట్టిపారేసిన చంపత్ రాయ్.

* 15 రోజుల్లోగా తుది నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆదేశం.

అయోధ్య, మహా.

అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తుల విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిఫార్సు మేరకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం రాత్రి అయోధ్యలో ఒక రామాలయ ఉద్యోగి నివాసంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే కానుకలు, విరాళాల నిర్వహణ బాధ్యతలు చూసే సదరు ఉద్యోగిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.

ఈ సోదాల్లో భాగంగా సదరు ఉద్యోగి ఇల్లు, పరిసరాల నుంచి పోలీసులు ఏకంగా రూ.10 లక్షల అక్రమ నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. లభించిన మొత్తం నగదులో కొంత భాగాన్ని ఇంట్లోని బీరువాలో దాచగా.. మరికొంత సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బయట ఉన్న ఆవు పేడ కుప్పలో దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. దీనితో పాటు సదరు ఉద్యోగి ఇటీవల కాలంలోనే లక్షల రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఉద్యోగిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ నగదు రికవరీ వ్యవహారంపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కానీ, స్థానిక పోలీసులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

### **అసలేంటీ వివాదం?**

రామమందిర విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఈ వివాదం ఆలయ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ చేసిన ఆరోపణలతో వెలుగులోకి వచ్చింది. ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు సమయంలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, సుమారు రూ.7 కోట్ల మేర విరాళాలు అపహరణకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. గతంలో తాను స్వయంగా అప్రమత్తంగా ఉండి సుమారు రూ.5 లక్షల నగదు దొంగతనాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తన ఫిర్యాదుకు ప్రతికారంగా తననే ఉద్యోగం నుంచి తొలగించారని మహిపాల్ సింగ్ ఆరోపించారు. ఆలయ ప్రాంగణంలోని కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని, భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పారదర్శకమైన డిజిటల్ రికార్డులు నిర్వహించడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పూర్తిగా కొట్టిపారేసింది. ఇదంతా పథకం ప్రకారం ఆలయంపై బురద జల్లేందుకు చేస్తున్న దుష్ప్రచారమేనని స్పష్టం చేసింది.

మహిపాల్ సింగ్ చేసిన ఆరోపణలను అస్త్రంగా చేసుకుని అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పాటు పలు ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. దేశవిదేశాల్లోని కోట్లాది మంది భక్తుల అచంచల విశ్వాసంతో ముడిపడి ఉన్న పవిత్రమైన అంశం కావడంతో, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేసి పారదర్శకతను నిరూపించుకోవాలని ట్రస్ట్ భావించింది. ఈ మేరకు నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతూ శనివారం ట్రస్ట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆశ్రయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ‘సిట్’ కమిటీలో లఖ్‌నవూ డివిజనల్ కమిషనర్ (ఐఏఎస్) విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ రేంజ్ (ఐపీఎస్) కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ఉన్నత స్థాయి బృందం 7 రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను, 15 రోజుల్లోగా పూర్తి స్థాయి తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

### **విచారణపై భిన్నాభిప్రాయాలు**

మరోవైపు రామాలయ విరాళాల అవకతవకలపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ అయోధ్యకు చెందిన విక్రమ్ తివారీ అనే వ్యక్తి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగదు స్వాధీనం మరియు అవకతవకలపై వస్తున్న వార్తా కథనాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, కాళీసేన వ్యవస్థాపకుడు స్వామి ఆనంద్ స్వరూప్ మాట్లాడుతూ ఈ గందరగోళాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులతో కూడిన ట్రస్ట్ ఈ విషయంపై విచారణ జరపడానికి తన సొంత కమిటీని ఏర్పాటు చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే స్వయంగా విచారణ జరుపుకోవడం సరికాదని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలన్నింటినీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తీవ్రంగా ఖండించారు. భక్తుల విరాళాల సేకరణ, వాటి రోజువారీ లెక్కింపు, భద్రత, బ్యాంకుల్లో జమ చేయడం వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా కంప్యూటరీకరించామని ఆయన స్పష్టం చేశారు. ఆలయానికి సంబంధించిన అన్ని ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిపుణులైన అధికారులతో క్రమం తప్పకుండా ఆర్థిక ఆడిట్ చేయిస్తున్నామని, అంతా పారదర్శకంగానే సాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు జరిపిన అంతర్గత దర్యాప్తులో ఎలాంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని చంపత్ రాయ్ వివరించారు.