సింగరేణిలో దోపిడి పై సమగ్ర దర్యాప్తు జరగాలి.
* రూ.1,600 కోట్ల గల్లంతుపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి కమిషన్ వేయాలి.
* సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధుల మళ్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
* ఈ బాగోతాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తా.
* బీజేపీ జాతీయ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
సింగరేణి సంస్థలో చోటుచేసుకున్నట్లు భావిస్తున్న భారీ అక్రమాలు, నిధుల మళ్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణ కమిషన్ను ఏర్పాటు చేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,600 కోట్లకు పైగా భారీ గండి పడిందన్న ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించి తీరాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణకు ఆదేశించి తమ ప్రభుత్వ పారదర్శకతను నిరూపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కొత్తగూడెంలో చేపట్టిన సింగరేణి క్వార్టర్ల నిర్మాణం, కిష్టారం గ్రామ సమీపంలోని సైలో బంకర్ నిర్మాణం, గనుల కేటాయింపులతో పాటు పలు ప్రాజెక్టుల అప్పగింతలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలపై తాము గతంలోనే తీవ్ర స్థాయిలో పోరాటాలు చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల ప్రాణాలు, రాష్ట్ర సంపదతో కొందరు ప్రభావశీల వర్గాలు చెలగాటం ఆడుతున్నాయనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటన్నింటినీ పూర్తిగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. కేవలం బొగ్గు, నిర్మాణాల్లోనే కాకుండా సింగరేణి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ), డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్) నిధుల వినియోగంలోనూ భారీ స్థాయిలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులను ఏయే ప్రాజెక్టులకు ఖర్చు చేశారు, ఎక్కడికి మళ్లించారు అనే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని ఆయన పట్టుబట్టారు.
సింగరేణి కార్మికుల కఠోర శ్రమతో నిర్మితమైన ఈ ప్రజా సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై వస్తున్న ప్రతి ఆరోపణపైనా నిష్పాక్షిక విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సింగరేణి వ్యవహారంపై జాతీయ స్థాయిలోనూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళతానని, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్వయంగా కలిసి సింగరేణికి సంబంధించిన అన్ని ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని కోరనున్నట్లు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు.








