Mahaa Daily Exclusive

  మార్పుకు సామాన్యులే ప్రతీక…

Share

మార్పుకు సామాన్యులే ప్రతీక.
* కాక్రోచ్ జనతా పార్టీ’పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.
* చలిచీమలైనా సరే సమిష్టిగా తలిస్తే ఎంతటి శక్తినైనా ఎదిరించగలవు.
*దిల్లీ సదస్సులో జనసేనాని అంతరంగం.
* అణచివేతపై ధ్వజమెత్తిన ఏపీ ఉపముఖ్యమంత్రి.
ఢిల్లీ, మహా.
గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఆదరణ పొందుతూ సంచలనం సృష్టిస్తోన్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని దిల్లీలో జనసేన ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సమాజంలో మార్పు అనేది ఎక్కడో పైనుంచి రాదని, ప్రతి సామాన్య వ్యక్తి ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటామని, కానీ బలమైన సంకల్పం ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని చెప్పారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భావం, ప్రస్థానాన్ని చూస్తుంటే తనకు వేమన రాసిన ‘చలిచీమలు చేత చిక్కి చావదె రక్కసి పాము’ అనే పద్యం గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. చీమలు చిన్నవే అయినా, అవన్నీ ఏకమైతే ఎంతటి బలమైన సర్పానైనా హతమార్చగలవని, అలాగే ఒక ఖచ్చితమైన ఆశయం, బలమైన లక్ష్యంతో ముందడుగు వేస్తే సమాజంలో ఎవరైనా అనుకున్న విజయాన్ని సాధించగలరని పవన్ కల్యాణ్ విశ్లేషించారు.
ఇదే వేదికపై జనసేన పార్టీ ఆవిర్భావం, ఇప్పటివరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తాము పార్టీని స్థాపించిన తరుణంలో దేశ సమగ్రత, ప్రజల శ్రేయస్సు తప్ప మరే ఇతర స్వార్థ ఆలోచనలు తమకు లేవన్నారు. నాడు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు భవిష్యత్తులో అధికారం వస్తుందో లేదో కూడా తెలియదని, కేవలం ఆశయ బలం తోడే ముందుకు సాగామని వివరించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాము ఎన్నో ఒడిదొడుకులను చూశామని, తీవ్రమైన పోరాటాలు చేశామని, ఎన్నో పరాజయాలను తట్టుకుని నిలబడి నేడు చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకున్నామని గర్వంగా ప్రకటించారు. కేవలం ఒక లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన జనసేన ప్రయాణం.. ఈ రోజున 20 లక్షలకు పైగా క్రియాశీలక సభ్యత్వాలతో ఒక మహా వృక్షంలా విస్తరించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాంతంపై, అక్కడి ప్రజలపై తమకున్న ప్రేమాభిమానాలను పవన్ కల్యాణ్ మరోసారి చాటుకున్నారు. నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు జనసేన పార్టీ ఏనాడూ అడ్డుపడలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే 2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన అప్రజాస్వామిక తీరును చూసి మాత్రమే తాము తీవ్రంగా కలత చెందామని చెప్పారు. నాటి విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరించిన ఏకపక్ష ధోరణి తెలుగు నేలపై తీవ్ర అసంతృప్తిని, అశాంతిని రేకెత్తించిందని విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, దానికి నిదర్శనమే హైదరాబాద్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు తాము తలపెట్టిన జనసేన సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడమేనని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.