Mahaa Daily Exclusive

  తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యమెందుకు?

Share

తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యమెందుకు?
* రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా సముచిత గౌరవం దక్కలేదు.
* దిల్లీ వేదికగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన.
* ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జనసేన నిరంతరం శ్రమిస్తుందని వెల్లడి.
ఢిల్లీ, మహా.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం (12 ఏళ్లు) గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో పాలకుల వైఖరి వల్ల ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని దిల్లీలో సోమవారం నిర్వహించిన జనసేన పార్టీ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణ త్యాగాలు చేసేంతటి గొప్ప నేల తెలంగాణ అని కొనియాడిన ఆయన, అక్కడి ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం తమ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సుమారు 1,200 మంది అమాయక యువకులు ప్రాణత్యాగం చేశారని, వారి నిస్వార్థ బలిదానాలు తన గుండెను ఎంతగానో కలచివేయడమే కాకుండా, తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. “ఒక పొలిటికల్ లక్ష్యం కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం ఇంతమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటారా అనిపించింది. అందుకే నాకు ఆ పవిత్ర నేల పట్ల, అక్కడి ఆత్మాభిమానం కలిగిన ప్రజల పట్ల ఎనలేని గౌరవం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న అమరవీరులకు నివాళులర్పించేందుకు గతంలో తాను హైదరాబాద్‌లో ఒక సభ నిర్వహించాలని భావించగా, అప్పటి ప్రభుత్వం కనీస అనుమతి నిరాకరించి అడ్డుకుందని ఈ సందర్భంగా ఆరోపించారు.
అమాయక యువతను బలిపశువులను చేసి, కొందరు స్వార్థ నాయకులు తెలంగాణలో అధికార పీఠాలను అధిరోహించారని పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. పదవుల కోసం ఆనాడు అమరులైన వారి ఆశయాలను నేటి పాలకులు అటకెక్కించారని మండిపడ్డారు. అయినప్పటికీ, తెలంగాణ ఉద్యమ అసలు సిసలైన ఆకాంక్షల సాధన కోసం, ప్రజల శ్రేయస్సు కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ లక్ష్య సాధన కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో ఉండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం శ్రమించాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.