- హైడ్రా చట్టానికి అతీతం కాదు
- ప్రైవేటు ఆస్తిలోకి ఎలీ వెళ్తారంటూ కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్
- చట్ట పరిధిని దాటి వ్యవహరించే హక్కు హైడ్రాకు లేదని స్పష్టం
హైదరాబాద్, మహా : హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చట్టానికి అతీతం ఏమీ కాదని తేల్చి చెప్పింది. ఓ స్థలానికి సంబంధించి తాము ఆదేశాలు ఇచ్చినా హైడ్రా అధికారులు అందులోకి ప్రవేశించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఆ భూమి ప్రభుత్వానిది అని నిరూపించడంలో విఫలమైన తర్వాత కూడా అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే హైడ్రా పరిమితమని తేల్చి చెప్పింది.
రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 1, 2 లో ఉన్న భూమికి సంబంధించిన యజమాన్య స్వాధీన హక్కులను రక్షిస్తూ తాము ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లినందుకు హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు మండిపడింది. హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా బహిరంగంగా ఉల్లంఘించిందని, హైడ్రా ప్రత్యేక విభాగంగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. కానీ హైడ్రా కూడా చట్టానికి అతీతులు కాదని.. పరిపాలనా వ్యవస్థలో ఒక భాగమేనని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరిధిని దాటి వ్యవహరించే అధికారం హైడ్రా అధికారులకు లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక నుంచి ఆ భూమిలోకి ప్రవేశించబోమని హైడ్రా తరఫు లాయర్ కోర్టుకు హామీ ఇవ్వడంతో.. దాన్ని ఉల్లంఘించొద్దంటూ.. కోర్టు హైడ్రా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆ భూమి యజమాని హైడ్రాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.
లోతుకుంట గ్రామ పరిధిలోని భూమికి సంబంధించిన విషయంలో శాంతా శ్రీరామ్ అనే నిర్మాణ సంస్థ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ భూ వివాదానికి సంబంధించి.. రిట్ అప్పీల్, సివిల్ సూట్, ఫస్ట్ అప్పీల్ వంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోయినా ఆ భూమిలోకి హైడ్రా అధికారులు ప్రవేశించి, జోక్యం చేసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందించిన హైడ్రా లాయర్.. సొసైటీ టు సేవ్ రాక్స్ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని సందర్శించినట్లు వివరణ ఇచ్చారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జడ్జి.. ఆ భూమి తమదేనని నిరూపించడంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూమిపై ఎలాంటి హక్కు లేదని.. హైడ్రా అధికారులు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించడం న్యాయపరంగా సరైంది కాదని తేల్చి చెప్పారు. హైడ్రా ఏర్పాటు ఉత్తర్వులను పరిశీలించిన హైకోర్టు జడ్జి.. రోడ్లు, కాలువలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే హైడ్రా పరిమితమని తేల్చిచెప్పారు.








