Mahaa Daily Exclusive

  స్థానికులకు భారీ ఊరట….

Share

స్థానికులకు భారీ ఊరట..
* టోల్ ప్లాజాల వద్ద త్వరలో డిజిటల్ ఈ-పాస్.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు, పదే పదే ఫీజులు చెల్లించాల్సిన ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. టోల్ వసూళ్లను మరింత వేగవంతం, పారదర్శకం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టోల్ గేట్లకు సమీపంలో నివసించే వాహనదారులకు భారీ ఊరటనిస్తూ త్వరలోనే ‘డిజిటల్ ఈ-పాస్’ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నూతన విధానం ద్వారా స్థానికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మార్గం సుగమం కానుంది.
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి ఈ డిజిటల్ పాస్‌లను జారీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పాస్‌ను నేరుగా వారి వాహన ఫాస్టాగ్‌కు అనుసంధానం చేస్తారు. ఫలితంగా స్థానిక వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. నిత్యం అటువైపు రాకపోకలు సాగించే స్థానికుల కోసం నెలవారీ, వార్షిక పాస్‌లను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడంతో పాటు, టోల్ గేట్ల వద్ద రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఇతర వాహనదారులు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా త్వరగా గేట్ దాటేందుకు ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తుంది.
ఈ ప్రత్యేక పాస్ జారీకి ముందు వాహనదారులు సదరు టోల్ ప్లాజా పరిధిలోని స్థానికులేనా అన్నది అధికారులు డిజిటల్ పద్ధతిలో ముందుగా ధృవీకరిస్తారు. అనంతరం నిర్దేశిత ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల గుండా ప్రయాణించేందుకు వారికి ప్రత్యేక పాస్ మంజూరు చేస్తారు. ఈ సరికొత్త విధానం ద్వారా అనధికారిక రాయితీలకు అడ్డుకట్ట పడటమే కాకుండా టోల్ వసూళ్ల వ్యవస్థ పూర్తి పారదర్శకంగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆశిస్తోంది. హరియాణా, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పలు టోల్ ప్లాజాల వద్ద ఈ డిజిటల్ పాస్ విధానాన్ని త్వరలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో టోల్ గేట్ల వద్ద నగదు రూపంలో ఫీజుల వసూలును కేంద్రం ఇప్పటికే నిలిపివేసిన విషయం విదితమే. ఈ కొత్త సంస్కరణతో వాహనదారుల ప్రయాణం మరింత సజావుగా సాగనుంది.