Mahaa Daily Exclusive

  డ్రగ్స్ రహిత భారత్‌కు యువతే శక్తి.

Share

  • ‘నషా ముక్త యువ’కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.
  •  వికసిత్ భారత్‌కు ఆరోగ్యవంతమైన యువతే బలం

ఢిల్లీ, మహా.

దేశ యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ‘నషా ముక్త యువ’ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతలో చైతన్యం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ సమగ్ర ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు దేశ యువత ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉండటం అత్యంత అవసరమని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమం కేవలం వ్యక్తులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడానికే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించామని చెప్పారు.

గత ఏడాది వారణాసి (కాశీ)లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ‘నషా ముక్త యువ’కు విశేష స్పందన లభించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు వెల్లడించారు. ఈ ఉద్యమంలో ఇప్పటికే 125 ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వాములయ్యాయని, డ్రగ్స్ రహిత భారత నిర్మాణానికి తమవంతు కృషి చేస్తున్నాయని తెలిపారు.

ఒక్క వ్యక్తి ప్రయత్నంతో ఇలాంటి సామాజిక సమస్యలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, సమిష్టి కృషితోనే విజయాన్ని సాధించవచ్చని ప్రధాని పేర్కొన్నారు. అనేక మంది కలిసికట్టుగా ముందుకు వస్తే ఆ ఐక్యతే గొప్ప శక్తిగా మారుతుందని, ఇప్పటికే లక్షలాది మంది యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారని వెల్లడించారు.

‘నషా ముక్త యువ’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు వాకథాన్‌లు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చావేదికలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు.

డ్రగ్స్ రహిత యువతే అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది అని, ప్రతి యువకుడు తన కుటుంబం, సమాజం, దేశం కోసం మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.