ట్విట్టర్ టిల్లు.. చెప్పేదంతా అబద్ధాల సొల్లు.
*కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి తీవ్ర ధ్వజం.
హైదరాబాద్, మహా.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ట్విట్టర్ టిల్లు.. చెప్తడు అబద్ధాల సొల్లు’ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. సవాల్‌ను స్వీకరించే దమ్ములేని ‘డ్రామారావు’ నుంచి అబద్ధాలు మినహా ఇంకేం ఆశిస్తామని ఘాటుగా విమర్శించారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సోషల్ మీడియా వేదికగా దీటుగా బదులిచ్చారు. అధికారం కోల్పోయామన్న తీవ్ర నైరాశ్యంతోనే పాలేరు నడిబొడ్డున పట్టపగలే పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు కేటీఆర్ విఫలయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి పేదలకు ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారో కనీసం లెక్క చెప్పలేని కేటీఆర్.. అతి తక్కువ కాలంలోనే లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలే అసలైన అవినీతికి అంబాసిడర్లని పొంగులేటి ధ్వజమెత్తారు. లక్ష కోట్ల కాళేశ్వరం కుంభకోణం మొదలుకొని.. ఈ-కార్ రేస్, గొర్రెల పంపిణీ, విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడటమే కాకుండా, ధరణి పోర్టల్ పేరుతో నిరుపేదల భూములను దారుణంగా కొల్లగొట్టిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. అలాంటి చరిత్ర కలిగిన వారు నీతులు మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. దళిత, గిరిజన వర్గాలను గత ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుందని మంత్రి ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క గిరిజన తండాలోనైనా కనీసం ఒక్క ఇల్లయినా నిర్మించి ఇచ్చారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కానీ, తమ ప్రభుత్వం కేవలం ఈ రెండు వ్యవత్సరాల కాలంలోనే గిరిజన ప్రాంతాలున్న నియోజకవర్గాలకు తొలి విడతగా 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, వీటికి అదనంగా మరో 1,500 ఇళ్లను మంజూరు చేసి గిరిజన గూడేల్లోని గుడిసెలను పక్కా ఇళ్లుగా మారుస్తూ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని పొంగులేటి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తాను గతంలో విసిరిన సవాల్‌ను కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి మరోసారి గుర్తుచేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల కంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను నిర్మిస్తేనే తాను తిరిగి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని పునరుద్ఘాటించారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఇళ్లు నిర్మించినట్లయితే తాను ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయనని కేటీఆర్ బహిరంగంగా ప్రకటించగలరా? అని సవాల్ విసిరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పదేళ్లలో కట్టిన ఇళ్ల కన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల వ్యవధిలోనే అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో సైతం తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. పేదలకు అత్యధిక ఇళ్లు నిర్మించి మేలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న వాస్తవం కేటీఆర్‌కు కూడా తెలుసునని, అందుకే ఆ సత్యం జీర్ణించుకోలేక, తన సవాల్‌ను స్వీకరించేందుకు ముందుకు రాకుండా ముఖం చాటేస్తున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.







