Mahaa Daily Exclusive

  జూన్ 20 వరకు తప్పని ఎండల సెగ….

Share

జూన్ 20 వరకు తప్పని ఎండల సెగ.
* నైరుతి ప్రవేశించినా మండుతున్న భానుడు.
* ఉత్తర, తూర్పు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ.
* సూర్యాపేట జిల్లా మోతేలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, భానుడి భగభగల నుంచి ప్రజలకు ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించే అవకాశాలు కనిపించడం లేదు. జూన్ 20వ తేదీ వరకు రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో పొడి వాతావరణమే నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా నివేదికల ఆధారంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగనుందని, ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
**పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ**
రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జూన్ 17, 18, 19 తేదీలకు గానూ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. సూర్యాపేట జిల్లా మోతేలో అత్యధికంగా 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లా ఏడుపాలెంలో 43.5 డిగ్రీలు, కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌లో 43.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు రాజధాని హైదరాబాద్‌లో సైతం పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని, ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
**వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు**
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం మీదుగా ప్రయాణిస్తున్నాయి. రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అత్యంత సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడానికి జూన్ 20 లేదా 21 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోగా రాష్ట్రంలో అక్కడక్కడా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.