Mahaa Daily Exclusive

  త్యాగాలు బీఆర్ఎస్‌వి.. మోసాలు రేవంత్‌వి…

Share

త్యాగాలు బీఆర్ఎస్‌వి.. మోసాలు రేవంత్‌వి.
* మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం.
* రేవంత్ రెడ్డిది ‘మిషన్ మోడ్’ కాదు.. ‘కమీషన్ మోడ్’.
* హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రికి అదే గతి పడుతుంది.
*హుస్నాబాద్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సదస్సులో నిప్పులు చెరిగిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్.
సిద్దిపేట, మహా.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన చరిత్ర భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీదైతే, నాడు దొంగ జిరాక్స్ కాపీలతో డ్రామాలు ఆడి నేడు అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన మోసపూరిత చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని బీఆర్ఎస్ నూతన శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ఓటర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన ‘మిషన్ మోడ్’ లో కాకుండా కేవలం ‘కమీషన్ల మోడ్’ లో సాగుతోందని, బడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడానికే ప్రజాసంక్షేమ పథకాలకు నిలువునా పాతరేశారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య జరిగిన పోటీలో కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపోయారని, కానీ కేవలం ఎనిమిది నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి అసలు స్వరూపం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని ఆయన పేర్కొన్నారు.

**సబ్బండ వర్గాల పొట్టగొడుతున్న కాంగ్రెస్ సర్కార్**

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల పొట్టగొడుతూ సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో అమలైన అద్భుత పథకాలన్నింటికీ ఈ ప్రభుత్వం మంగళం పాడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా రైతుబంధు నిధుల ఊసేలేదని, గత ఐదు నెలలుగా రైతుబీమా పథకాన్ని కూడా బంద్ పెట్టి అన్నదాతలను నిలువునా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ అంటూ రైతాంగాన్ని దారుణంగా వంచించారని, ఐదు కిలోల తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద వేల కోట్లు కేటాయించి కేవలం కరెంట్ బిల్లులు, జీతాలకే పరిమితం చేశారని, రేవంత్ కేబినెట్‌లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేకపోవడం వారి గిరిజన వ్యతిరేక విధానానికి అద్దం పడుతోందని విమర్శించారు. దళితులకు లోన్లు ఇవ్వడం లేదని, గతంలో కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గొల్లకురుమలకు గొర్రెల పంపిణీని, మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీని నిలిపివేశారని, చేనేత కార్మికులకు రావాల్సిన బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంల ఆర్డర్లను గుజరాత్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఇక్కడి నేతన్నల పొట్టగొట్టారని ఆరోపించారు. వైన్ షాపుల్లో గౌడన్నలకు కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్లను పక్కనబెట్టి, నేడు వేలాది మంది గౌడ కార్మికులను జైళ్లకు పంపుతున్న ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
**ప్రజాధనం దుర్వినియోగం.. ప్రశ్నిస్తే చిల్లర మాటలా?**

రాష్ట్రంలో పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడానికి, పేదల ఇందిరమ్మ ఇళ్లకు పైసలు లేవంటున్న ముఖ్యమంత్రి, తన సొంత విలాసాలకు, ప్రచారాలకు మాత్రం వందల కోట్లు తగలేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఎంసీహెచ్ఆర్డీలో వంద కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మించుకుంటూ, తన ఇంటి చుట్టూ పదిహేడు కోట్లతో ఇనుప కంచెలు వేయించుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు, సరుకుల బిల్లులు ఇవ్వకుండా వారి నోటి కాడి కూడు లాక్కుంటున్నారని, కానీ కార్పొరేట్ స్నేహితుల పిల్లలతో, మంత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడేందుకు మాత్రం వందల కోట్లు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో కనీసం మోరీలు బాగుచేయడం చేతకాని ముఖ్యమంత్రి, ఒకటిన్నర లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటూ కేవలం కమీషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారని, ఫ్యూచర్ సిటీ పేరిట లేనిపోని భ్రమలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇటీవల ఓ పాఠశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి తన శారీరక ఎత్తును ప్రస్తావిస్తూ తాటిచెట్టు, ఈతచెట్టు అంటూ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడి ఎత్తుతో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తాను రేవంత్ రెడ్డి లాగా చిల్లర మాటలు మాట్లాడబోనని, ప్రజల పక్షాన నిలబడి రైతుబంధు ఎప్పుడిస్తావ్, రైతుబీమా ఎందుకు ఆపేశావ్, బోనస్ ఏమైంది, ఫీజులు ఎప్పుడు చెల్లిస్తావని సూటిగా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే హామీలను నెరవేర్చేలా చేస్తామని, ప్రభుత్వ స్కాములను నిరంతరం బయటపెడుతూనే ఉంటామని భీష్మించారు. ఖమ్మంలో పన్నెండేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే స్థానిక ముగ్గురు మంత్రులు పట్టించుకోలేదని, తాను స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని మీడియా ముందు ఉంచితేనే ఈ దద్దమ్మ ప్రభుత్వం కదలివచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

**’ఎస్ఐఆర్’ ఓటర్ల సవరణపై గులాబీ శ్రేణులు అప్రమత్తం కావాలి**

రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఓటర్ల సర్వే ప్రక్రియపై బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ సర్వే ప్రక్రియలో కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఓట్లను తొలగించి జాబితాను శుద్ధి చేసే ఈ ప్రక్రియలో అధికారికంగా రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం ఉందని ఆయన గుర్తుచేశారు. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికి వచ్చేటప్పుడు బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లు తప్పనిసరిగా వారి వెంట ఉండాలని సూచించారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ఫారాలు, కొత్త ఓటరు నమోదు పత్రాలు నింపడంలో సామాన్య ప్రజలకు దగ్గరుండి సహాయం చేయాలన్నారు. ఒకవేళ ఏ నియోజకవర్గంలోనైనా అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తూ సహకరించకపోతే వెంటనే ఏఆర్ఓ, ఆర్డీఓలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఒక్కో ఓటు అత్యంత క్రియాశీలకంగా మారుతుందని, కాబట్టి ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

**హుస్నాబాద్‌ గడ్డపై ఉద్యమ జ్ఞాపకాలు**

హుస్నాబాద్ ప్రాంతంతో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి ఉన్న అనుబంధాన్ని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ గారికి హుస్నాబాద్ అంటే ఎంతో నమ్మకమని, ఉద్యమ కాలంలో ఇక్కడి నుంచే సింహగర్జన ఎన్నికల శంఖారావాన్ని పూరించేవారని చెప్పారు. నాటి కాంగ్రెస్ పాలనలో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కోసం తాము ఎన్నో దీక్షలు, పోరాటాలు చేశామని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వివరించారు. ఎస్పీ, డీఎస్పీ, ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీసులతో పాటు బస్టాండ్‌ను పూర్తిస్థాయి డిపోగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టును, గండి మహాసముద్రం చెరువును అద్భుతంగా తీర్చిదిద్ది కేసీఆర్ గారు ప్రత్యేక ప్యాకేజీతో ట్రయల్ రన్ కూడా పూర్తి చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా కనీసం 30 గజాల కాలువ కూడా తవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోని పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికే తనకు రెండున్నరేళ్లు పడుతుందని చెప్పుకునే ముఖ్యమంత్రికి, గౌరవెల్లి ప్రాజెక్టు అర్థం కావడానికి ఐదేళ్లు పడుతుందా అని చమత్కరించారు. తమ చేతగానితనాన్ని అధికారులపై నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ గారు నిరాహార దీక్షకు వెళ్తుంటే, అలుగునూరు చౌరస్తాలో ఆయనతో పాటే అరెస్టయి జైలు జీవితం గడిపిన గొప్ప నిబద్ధత గల నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అని, ఈ వయసులో కూడా ఆయన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రావడం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 610 జీవో అమలు చేయకుండా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతుంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే ముందుగా స్పీకర్ ఫార్మాట్‌లో పదవులను తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేశామని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒరిజినల్ కాపీ జేబులో పెట్టుకుని జిరాక్స్ కాపీ ఇచ్చి త్యాగాల డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు.
తనను తాను హిట్లర్‌తో పోల్చుకుంటూ, హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఆ హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని హరీశ్ రావు తీవ్ర హెచ్చరిక చేశారు. ఐరోపాలో హిట్లర్ పేరు ఎత్తితే ఏ విధంగా నిషేధిస్తారో, రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని అదే విధంగా రాజకీయంగా నిషేధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు సహా స్థానిక నాయకులు, గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.