మేలుజాతి వంగడాల సాగుకు పెద్దపీట.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
* రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
* లాభదాయక వ్యవసాయం వైపు అడుగులు.
* కేబినెట్ సబ్ కమిటీ భేటీలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్య నిల్వలపై సమగ్ర సమీక్ష.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, తెలంగాణ వ్యవసాయ రంగం మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న పేద ప్రజలందరూ సన్నబియ్యం తినాలనేది, అదే సమయంలో పంటలు పండించే అన్నదాతలు ఆర్థికంగా బలోపేతం కావాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ (మంత్రుల ఉప సంఘం) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కీలక భేటీకి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నిల్వ సదుపాయాల కల్పన తదితర అంశాలపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
**మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపైనే దృష్టి**
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అత్యధిక డిమాండ్ ఉన్న పంటల సాగుకు రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నాణ్యమైన, మేలుజాతి వరి రకాల సాగును విస్తరింపజేసేందుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా బీపీటీ 5204 (BPT 5204), తెలంగాణ సోనామసూరి, కేఎన్ఎమ్-1638 (KNM-1638), జై శ్రీరామ్, హెచ్ఎంటీ (HMT) వంటి మేలుజాతి వరి వంగడాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని, వీటి ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు. మేలుజాతి వంగడాల సాగును అవలంబించడం ద్వారానే ఎకరానికి దిగుబడి పెరిగి, రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని వ్యవసాయ కమిషన్ సైతం ప్రభుత్వానికి సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
**కేంద్ర విధానాలతో రైతులకు నష్టం**
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని ప్రతికూల వాతావరణ విధానాల వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనుగోళ్లను కేంద్రం పూర్తిగా నిలిపివేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి తోడు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సైతం రాష్ట్రం నుంచి కొనుగోళ్లను భారీగా తగ్గించుకోవడంతో క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని వ్యవసాయ కమిషన్ అభిప్రాయపడినట్లు తెలిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికే రాబోయే పంట సీజన్లలో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న నాణ్యమైన వరి రకాల సాగు విస్తరణను ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త సాగు పద్ధతులు, మేలుజాతి వంగడాల విశిష్టతపై రాష్ట్రంలోని గ్రామగ్రామాన రైతులకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతు కమిషన్ సూచించిందని, దాని ప్రకారం త్వరలోనే క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.








