- ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం
- మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్
- మనీ లాండరింగ్ చేసినట్లు గుర్తించిన ఈడీ
అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఏపీ మద్యం స్కాంలో సుదీర్ఘంగా దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్‌ను గురువారం అరెస్టు చేశారు. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ జరిపిన సోదాల అనంతరం లభించిన కీలక ఆధారాల ప్రాతిపదికన ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగిన మద్యం సరఫరా, డిస్ట్రిబ్యూషన్, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ గతేడాది నుంచి విచారణ జరుపుతోంది. ఈ కేసులో కారుమూరి సునీల్ కుమార్ కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడీ గుర్తించింది. ఈ అరెస్టుకు ముందు ఈడీ బృందాలు హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కు చెందిన ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో భారీగా నగదుతో పాటు, డిజిటల్ డివైజ్‌లు, ఇన్వాయిస్‌లు, కొన్ని డమ్మీ కంపెనీలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలపై సునీల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం, ఆయన సమాధానాలపై సంతృప్తి చెందకపోవడంతో అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టును నమోదు చేశారు.
సునీల్‌పై ఉన్న ప్రధాన అభియోగాలు ఇవే
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం కారుమూరి సునీల్‌పై ప్రధానంగా మూడు కీలక అభియోగాలు ఉన్నాయి. మద్యం బ్రాండ్ల అనుమతులు, డిస్టిలరీల నుంచి సప్లై ఆర్డర్ల కేటాయింపుల్లో క్విడ్ ప్రో కో పద్ధతిలో వందల కోట్ల రూపాయల చేతులు మారాయనేది ప్రధాన ఆరోపణ. మద్యం వ్యాపారాల ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల్లో ఇతర రాష్ట్రాలకు, విదేశీ పెట్టుబడులకు మళ్లించారనే ఆరోపణలపై ఈడీ గురిపెట్టింది. తండ్రి మంత్రిగా ఉన్న కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా చేశారని ఈడీ భావిస్తోంది.
కక్ష సాధింపే అంటున్న వైసీపీ
కారుమూరి సునీల్ అరెస్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలనే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపించింది. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులకు తెరతీస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వర్గీయులు మండిపడుతున్నారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, చట్టపరంగానే ఈ వేధింపులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.








