Mahaa Daily Exclusive

  పవన్ కల్యాణ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి….

Share

పవన్ కల్యాణ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి.
* తెలంగాణ ఆనవాళ్లను చెరిపేస్తున్న రేవంత్ సర్కార్.
* ఉద్యమకారుల విస్మరణపై కరీంనగర్ రౌండ్‌టేబుల్ సమావేశంలో కవిత ధ్వజం.
కరీంనగర్, మహా.
తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పోల్చిన సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి తెలంగాణ ఆనవాళ్లను, భావజాలాన్ని పక్కనపెడుతూ పొరుగు రాష్ట్ర నాయకుల పెత్తనానికి మళ్లీ బాటలు వేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయుల కళాతోరణాన్ని రాచరిక పోకడ అంటూ తొలగించారని, చార్మినార్, పూర్ణకుంభం తీసేసే ప్రయత్నం చేసి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారని విమర్శించారు. గెజిట్ నోటిఫికేషన్ లేదన్న సాకుతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, కొత్త విగ్రహం చేతిలో బతుకమ్మ లేకుండా చేసి తెలంగాణను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండానే విగ్రహాన్ని మార్చేశారని, గూగుల్‌లోనూ ఉద్యమ కాలం నాటి పాత విగ్రహం కనిపించకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కళాకారులకు అడ్డాగా ఉండాల్సిన రవీంద్రభారతిలో సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం, గద్దరన్న పేరుతో జానపద అకాడమీకి బదులు సినిమా అవార్డులు ఇవ్వడం ఆంధ్రా పెత్తనానికి నిదర్శనమన్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని, జయశంకర్ సార్, మహాత్మా పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో అభివృద్ధి పేరుతో 2009లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి, ఉద్యమ వాదానికి అడ్డాగా ఉన్న ఆ ప్రాంతాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఇక్కడ సభ పెట్టి, తెలంగాణ ప్రజలను వేర్పాటువాదులు, ఉగ్రవాదులతో పోల్చిన పవన్ కల్యాణ్‌పై ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత నిలదీశారు. వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపోవడం అని, తెలంగాణ ప్రజలు దేశం నుంచి వేరు అవుతామని ఎప్పుడైనా అన్నారా అని ప్రశ్నించారు. ఒక సినీ నటుడు ఇష్టానుసారం మాట్లాడితే దేశద్రోహం కేసు పెట్టేందుకు చేతకాని ప్రభుత్వం, సింగరేణి కార్మికుల కోసం మాట్లాడినా, హక్కుల కోసం సచివాలయం ముందు ధర్నా చేసినా తమపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు.
ఉద్యమకారుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా నేటికీ వారిని గుర్తించలేదని కవిత విమర్శించారు. ఎవరైనా పోరాటం చేస్తే కేవలం కమిటీలు వేసి మరుసటి రోజే మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. జార్ఖండ్ రాష్ట్రం తమ ఉద్యమకారులకు బస్సు, రైలు ప్రయాణాల్లో రాయితీలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి గౌరవించుకుంటోందని, ఆ జీవోలను ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చినా కనీస చలనం లేదన్నారు. ఈ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కొట్లాడాల్సిన అవసరం ఉందని, అందుకోసం పసికూన లాంటి తమ కొత్త పార్టీని ముందుకు నడిపించేందుకు ఉద్యమకారులందరూ తగిన సూచనలు, సలహాలు, భవిష్యత్ కార్యాచరణను అందించాలని కవిత పిలుపునిచ్చారు.