Mahaa Daily Exclusive

  తిరుపతిలో కుళ్లిన చేపల కలకలం….

Share

తిరుపతిలో కుళ్లిన చేపల కలకలం.
* పురుగులు పట్టిన మత్స్య సంపద విక్రయాలు.
* ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మున్సిపల్ అధికారులు.
* రెండు దుకాణాల ట్రేడ్ లైసెన్సులు రద్దు, సీజ్.

తిరుపతి, మహా.
నగరంలోని లీలామహల్ కూడలి వద్ద ఉన్న చేపల మార్కెట్‌లో కుళ్లిపోయి, తీవ్ర దుర్వాసన వస్తున్న చేపలు, రొయ్యలను విక్రయిస్తున్న రెండు దుకాణాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఉన్న ఈ వ్యవహారంపై నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సూచనలు, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు వెటర్నరీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టారు.
లీలామహల్ సెంటర్‌లోని చేపల మార్కెట్‌లో మొత్తం 22 దుకాణాలు ఉన్నాయి. అయితే, ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన పాడైపోయిన చేపలను విక్రయిస్తున్నారన్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల్లో భాగంగా షాప్ నంబర్ 9, 10లలో అక్రమాలు వెలుగుచూశాయి. సదరు ఫ్రీజర్లకు కనీసం మూతలు కూడా లేకపోవడంతో, లోపల సరైన పద్ధతిలో నిల్వ చేయని చేపలు, రొయ్యలకు పురుగులు పట్టి తీవ్ర దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ రెండు దుకాణాల్లోని కుళ్లిన మత్స్య సంపదను బయటకు తీయించి, వాటిపై క్రిమిసంహారక మందులు చల్లారు. అనంతరం మున్సిపల్ వాహనంలో వాటిని నగర శివారులోని డంపింగ్ యార్డుకు తరలించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 492 నుంచి 498 వరకు, 521, 541 నుంచి 546 వరకు, మరియు 622 సెక్షన్ల కింద నిబంధనలు అనుసరించి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్న 9, 10 నంబర్ల దుకాణాలకు చెందిన ట్రేడ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, ఆ రెండు షాపులను సీజ్ చేసినట్లు డాక్టర్ యువ అన్వేష్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మార్కెట్‌లోని మిగిలిన 20 దుకాణాల యజమానులకు అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దుకాణాల వద్ద, చుట్టుపక్కల పరిసరాలను ఎప్పటికప్పుడు మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన, తాజా చేపలను మాత్రమే ఎప్పటికప్పుడు తెచ్చుకుని వినియోగదారులకు విక్రయించాలని, నిబంధనలు అతిక్రమించి నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తేల్చిచెప్పారు.