Mahaa Daily Exclusive

  రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు…

Share

రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు.
* కృష్ణలంక పీఎస్ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలంటూ తల్లి పిటిషన్.
* నేడు తీర్పు వెలువరించనున్న విజయవాడ రెండో ఏజేఎం కోర్టు.
* విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నియామకం.
విజయవాడ, మహా.
నగరంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను తక్షణమే భద్రపరచాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ రెండో ఏజేఎం కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది.
పోలీసుల తీరుపై సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు బలవంతంగా తన సెల్ ఫోన్ తీసుకుని పలు కాల్స్ చేశారని ఆమె ఆరోపించారు. తన కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అసలు ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలంటే సీసీటీవీ ఆధారాలను తక్షణం కాపాడాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. కృష్ణలంక పీఎస్‌లో తన కుమారుడు లాకప్ డెత్‌కు గురయ్యాడనే బలమైన అనుమానాలు ఉన్నాయని, అసలు సాయికృష్ణ బతికి ఉన్నాడో లేదో పోలీసులు స్పష్టం చేయాలని విజయలక్ష్మి కన్నీటిపర్యంతమవుతున్నారు.
పోలీసులపై వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారి (ఐఓ)గా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా, తమ కుమారుడి అదృశ్యం వెనుక పోలీసుల హస్తం ఉందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు, ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగుచూడాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.