Mahaa Daily Exclusive

  ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు….

Share

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు.
* కబ్జాదారుల భరతం పట్టేందుకే హైడ్రా.
* పేదల జోలికి వెళ్లదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ.
* గుర్రంగూడ ఎకో పార్క్‌లో వనమహోత్సవం ప్రారంభం.

రంగారెడ్డి, మహా.
ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. భూ కబ్జాలతో సాధారణ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా హైడ్రాను ఒక భూతంలా చూపెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల జోలికి వెళ్లదని, కేవలం కబ్జాదారుల భరతం పడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొంతమంది ఏకంగా గుర్రంగూడ ఎకో పార్క్‌ను సైతం కబ్జా చేయాలని చూశారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, వనస్థలిపురంలో ఏకంగా దేవుడి భూములను కూడా కబ్జాలో పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం గుర్రంగూడ ఎకో పార్క్‌లో సీఎం వన మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హరిత నిధి కార్యక్రమం ద్వారా ఆయన స్వయంగా ఒక నాగలింగం మొక్కను నాటారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్‌ ఏనుగును ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు గుర్రంగూడ ఎకో పార్క్‌ నమూనాను ముఖ్యమంత్రికి వివరంగా వివరించారు. ఈ ఎకో పార్క్‌లో రూ.35.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. వీటితో పాటు, గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. తనను ఓడించాలని కొందరు ఎన్నో కుట్రలు పన్నారని, 2018లో ఆ కుట్రల వల్లనే తాను కొడంగల్‌లో ఓడిపోయానని ఆయన చెప్పారు. ఆ ఓటమితో తాను ఇక ఏమీ చేయలేనని కొందరు భావించారని, కానీ పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుక ఉండాలన్న ఉద్దేశంతో మల్కాజ్‌గిరి ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని ఆయన ప్రస్తావించారు. కేవలం ఇక్కడి ప్రజల అభిమానమే తనను నేడు ముఖ్యమంత్రిగా నిలబెట్టిందని వివరించారు. ఎల్బీనగర్‌ ప్రజలు తనకు ఏకంగా 30 వేలకుపైగా ఓట్ల మెజారిటీ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. తన సొంతూరు కొండారెడ్డిపల్లి లాంటిదే తనకు ఎల్బీనగర్‌ అని సీఎం అభివర్ణించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎల్బీనగర్‌ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎల్బీనగర్‌ సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని మాటిచ్చారు. రంగారెడ్డి జిల్లాకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కోహెడలో ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్య కోరల్లో చిక్కుకుని ఢిల్లీ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మన హైదరాబాద్‌కు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకూడదనే మొక్కల పెంపకాన్ని ప్రోత్సాహిస్తున్నామని వివరించారు. మరోవైపు, నగరంలో 60 శాతం గ్రీనరీ పెంచుతామంటే ఎన్జీటీ లో కేసులు వేశారని సీఎం రేవంత్‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే కొందరు కావాలనే అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. మూసీ ఒడ్డున నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అభివృద్ధి చేస్తామంటే దానికి కూడా కొందరు మోకాలడ్డుతున్నారని దుయ్యబట్టారు. 30 వేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫ్యూచర్‌ సిటీ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. తాము ఫ్యూచర్‌ సిటీ కడతామంటే, మళ్లీ ఫార్మా కంపెనీలే తెస్తామంటున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయంగా ఫ్యూచర్‌ లేనివాళ్లు మాత్రమే ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ముందుగా వాళ్లు సిద్దిపేటలో గెలిచి రావాలని, ఆ తర్వాతే ఫ్యూచర్ సిటీ రద్దుపై మాట్లాడదామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.