మైనార్టీల అభ్యున్నతికే ప్రభుత్వ పెద్దపీట.
* బడ్జెట్లో సంక్షేమానికి భారీగా నిధుల కేటాయింపు.
* 20 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధం.
* ఉన్నతస్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తాజా బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను కేటాయించిందని ఆయన వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ పనుల పురోగతిపై భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముషాయిరాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీ స్థాయిలో ముషాయిరా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 20 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మరో 17 పాఠశాలల పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక టైమ్ క్యాలెండర్ను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మైనార్టీ యువతకు దన్నుగా నిలిచేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాగే, క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ. 50 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. మరోవైపు, వక్ఫ్ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అక్రమాలకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మైనార్టీల శ్మశాన వాటికల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని, కొత్త శ్మశాన వాటికల ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ శ్మశాన వాటికల చుట్టూ రక్షణ కోసం ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఈ సమీక్షలో స్పష్టం చేశారు.








