Mahaa Daily Exclusive

  ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న ‘బ్రహ్మోస్’ సత్తా…

Share

ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న ‘బ్రహ్మోస్’ సత్తా.
• రష్యా సాయుధ దళాల్లోకి మన బ్రహ్మోస్ క్షిపణులు!
• ఆపరేషన్ సిందూర్’ విజయంతో హాట్ కేకుల్లా పెరిగిన డిమాండ్.
• వియత్నాంతో త్వరలో ఒప్పందం: బ్రహ్మోస్ చీఫ్ జైతీర్థ్ జోషి వెల్లడి.

నాగపూర్,మహా.
భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన ‘బ్రహ్మోస్’ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సత్తా ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. తాజాగా, ఈ బ్రహ్మోస్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకునేందుకు రష్యా తీవ్ర ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్షిపణుల ఉత్పత్తిని భారీగా పెంచే దిశగా రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ సంస్థ తయారు చేసిన 100వ స్వదేశీ బూస్టర్‌ను విజయవంతంగా ప్రారంభించిన నేపథ్యంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ జైతీర్థ్ జోషి ఈ కీలక పరిణామాలను వెల్లడించారు.
బ్రహ్మోస్ ప్రాజెక్టుకు సంబంధించి రష్యాలో ఇప్పటికే పారిశ్రామిక భాగస్వాములు, సొంత తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఈ క్షిపణుల అవసరం మరింతగా పెరిగింది. అయితే, పెరిగిన ఈ అదనపు డిమాండ్‌ను చేరుకోవడానికి రష్యాలోని ప్రస్తుత తయారీ సామర్థ్యం సరిపోకపోవచ్చని, అందుకే భారత రక్షణ రంగం ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించనుందని జైతీర్థ్ జోషి వివరించారు. రష్యాతో కలిసి పనిచేస్తూ, వారి సైనిక అవసరాలకు తగినట్లుగా మన దేశం నుంచే క్షిపణి వ్యవస్థలను సరఫరా చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గత పాతికేళ్లుగా బ్రహ్మోస్ ప్రాజెక్టుపై సాగిన నిరంతర పరిశోధనలు, క్లిష్టమైన పరీక్షలు, విజయవంతమైన మోహరింపుల వల్లే నేడు అంతర్జాతీయ మార్కెట్లో ఈ క్షిపణికి ఇంతటి నమ్మకం ఏర్పడిందని జోషి విశ్లేషించారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ ప్రయోగాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సాధారణంగా క్షిపణులను భూమి లేదా నౌకల నుంచి కృత్రిమ పద్ధతుల్లో పరీక్షిస్తుంటారని, కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో మాత్రం శత్రువులపై నేరుగా బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించి దాని సత్తాను విజయవంతంగా నిరూపించామని గుర్తుచేశారు. ప్రపంచ రక్షణ రంగంలోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిందని, ఈ విజయమే అంతర్జాతీయ కొనుగోలుదారులలో బ్రహ్మోస్ పట్ల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని ఆయన సగర్వంగా చెప్పారు. తద్వారా ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణులు ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. వియత్నాం దేశానికి బ్రహ్మోస్ క్షిపణులను సరఫరా చేయడానికి సంబంధించిన చర్చలు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయని జోషి ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించి కేవలం కొన్ని అధికారిక లాంఛనాలు, అనుమతులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, అతి త్వరలోనే ఇది ఖరారు కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం వియత్నాం మాత్రమే కాకుండా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు చెందిన మరికొన్ని దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణుల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని, ఆయా దేశాలతో ఎగుమతులపై చర్చలు కొనసాగుతున్నాయని బ్రహ్మోస్ చీఫ్ జైతీర్థ్ జోషి వివరించారు.