Mahaa Daily Exclusive

  భారత యువ సంచలనం వైభవ్‌కు బీసీసీఐ అరుదైన వెసులుబాటు!

Share

భారత యువ సంచలనం వైభవ్‌కు బీసీసీఐ అరుదైన వెసులుబాటు!
* తల్లిదండ్రుల విదేశీ ప్రయాణ, వసతి ఖర్చులన్నీ బోర్డువే.
* పదిహేనేళ్ల వయసులో ఎంట్రీ.. సచిన్ తర్వాత ఇతడేనన్న సైకియా.
* ఐపీఎల్‌లో 776 పరుగులతో చెలరేగిన చిచ్చర పిడుగు.
ముంబై, మహా.
భారత క్రికెట్‌లో నయా సంచలనంగా దూసుకొస్తున్న పదిహేనేళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అరుదైన అవకాశం కల్పించింది. త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన ఈ యువ బ్యాటర్‌ వెంట అతడి తల్లిదండ్రులు కూడా వెళ్లేందుకు బోర్డు ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. వారి ప్రయాణంతో పాటు వసతి ఖర్చులన్నింటినీ పూర్తిగా తామే భరిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. కేవలం 15 ఏళ్ల చిరుప్రాయంలోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్.. సీనియర్ ఆటగాళ్ల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.
జాతీయ జట్టులో 14, 15 ఏళ్ల వయసున్న కుర్రాళ్లు ఉండటం చాలా అరుదైన విషయమని సైకియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడు మాత్రమే అంత చిన్న వయసులో భారత జట్టులోకి వచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వైభవ్ సైతం సరిగ్గా అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే ఉన్నాడని, విదేశాల్లోని కొత్త వాతావరణ పరిస్థితులకు అతడు త్వరగా అలవాటు పడాలంటే తల్లిదండ్రుల సాన్నిహిత్యం ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సైకియా వివరించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా 237కు పైగా కళ్లుచెదిరే స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడిన ఈ చిచ్చర పిడుగు.. టోర్నీలో మొత్తం 776 పరుగులు సాధించి ప్రతిష్ఠాత్మక ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ‘మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్’, ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి విధ్వంసక బ్యాటింగ్‌ను గుర్తించిన బీసీసీఐ, ఏకంగా భారత టీ20 జట్టులో అవకాశం కల్పించింది. కాగా, విదేశీ పర్యటనల కంటే ముందు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.