ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్..
* 500 కిలోల గంజాయి పట్టివేత!
* ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తుండగా అడ్డగింపు.
* 80 కిలోమీటర్ల మేర ఛేజింగ్.. అడవిలో వాహనం వదిలి పరారైన డ్రైవర్.
* ఈగల్ ఫోర్స్ బృందాన్ని అభినందించిన ఒడిశా పోలీసులు.
కొరాపుట్,మహా.
తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున గంజాయి సరఫరా చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాపై ‘ఈగల్ ఫోర్స్’ బృందం శరవేగంతో దాడి చేసి భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఒడిశా రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఏకంగా 500 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
ఒడిశాలోని బలిమేళా ప్రాంతం నుంచి జయపూర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర గంజాయి రవాణా అవుతున్న బొలెరో వాహనాన్ని ఈగల్ ఫోర్స్ బృందం అత్యంత సాహసోపేతంగా వెంబడించింది. పోలీసుల ఛేజింగ్‌ను గమనించిన నిందితుడు, మార్గమధ్యలో దట్టమైన అటవీ ప్రాంతంలో వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యాడు. అనంతరం ఆ వాహనాన్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా 115 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన గంజాయి లభ్యమైంది.
స్వాధీనం చేసుకున్న ఈ సరుకులో 90 ప్యాకెట్లు ఐదు కిలోల చొప్పున ఉండగా, మరో 25 ప్యాకెట్లను రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. పట్టుబడిన 500 కిలోల గంజాయితో పాటు ఆ బొలెరో వాహనాన్ని తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం ఒడిశాలోని కొరాపుట్ పోలీసులకు ఈగల్ ఫోర్స్ బృందం అప్పగించింది.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న వాహనం ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. కాగా, 2024 సంవత్సరంలోనూ ఈగల్ ఫోర్స్ సరిగ్గా ఇలాంటి ఆపరేషన్‌నే చేపట్టి, నిందితులను రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. గంజాయి ముఠా ఆటకట్టించేందుకు తాజాగా నిర్వహించిన ఈ హైరిస్క్ ఆపరేషన్ పట్ల ఒడిశా పోలీసులు ఈగల్ ఫోర్స్ అధికారుల పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించి, అభినందనలు తెలిపారు.








