Mahaa Daily Exclusive

  గంజాయి, డ్రగ్స్‌పై ఏపీ సర్కార్ యుద్ధం!

Share

గంజాయి, డ్రగ్స్‌పై ఏపీ సర్కార్ యుద్ధం!
* రాంకీ కోస్టల్ ప్లాంట్‌లో 20,876 కేజీల గంజాయి దహనం.
* మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘ఈగల్’ వ్యవస్థ ఏర్పాటు.
* యువతను రక్షించడమే లక్ష్యమన్న హోం మంత్రి వంగలపూడి అనిత.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి బారి నుంచి రక్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా గురువారం జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పరిధిలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో పోలీసులు భారీ ఎత్తున పట్టుబడిన మత్తుపదార్థాలను ధ్వంసం చేశారు. దాదాపు 20,876 కేజీల గంజాయితో పాటు 23 కేజీల హాష్ ఆయిల్‌ను శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధికారులు దహనం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోం మంత్రి అనిత అనంతరం మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేకంగా ‘ఈగల్’ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత వెల్లడించారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగుకు తమ ప్రభుత్వం పూర్తిగా చెక్ పెట్టిందని ఆమె పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే గిరిజనులలో మార్పు తీసుకువస్తూ, వారికి ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తూ ఈ మహమ్మారిని అరికడుతున్నామని చెప్పారు. గత 18 నెలల కాలంలోనే ఐదుసార్లు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని మంత్రి వివరించారు. పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు ఏపీ మీదుగా సాగుతున్న గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఈగల్ బృందాలతో పాటు ప్రత్యేక చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల కదలికలను సరిహద్దుల్లోని సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నామని హోం మంత్రి తెలిపారు. డ్రగ్స్ కేసులకు సంబంధించిన విచారణలను సైతం అత్యంత వేగవంతంగా ముగించి నిందితులకు శిక్షలు పడేలా చూస్తున్నామని చెప్పారు. యువత ఎలాంటి మత్తు పదార్థాలకు లొంగిపోకుండా జీవితాలను పాడుచేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిపై తాము రాజీలేని యుద్ధం ప్రకటించామని, ‘చైతన్యం’, ‘సంకల్పం’ వంటి ప్రత్యేక కార్యక్రమాల పేరుతో డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం ఏపీ పోలీస్ యంత్రాంగం అద్భుతంగా కృషి చేస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు.