కాంగ్రెస్‌కు భారీ షాక్..
* జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్!
* విజయం సాధించిన పరిమళ్ నత్వానీ, జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్.
* ఓటమి చవిచూసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా.
* చరిత్రాత్మకంగా నాలుగోసారి పెద్దల సభకు నత్వానీ
రాంచీ,మహా.
జార్ఖండ్ రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బైద్యనాథ్ రామ్ విజయం సాధించారు. జేఎంఎం అభ్యర్థి రామ్ అత్యధికంగా 30 ఓట్లు కైవసం చేసుకోగా, పరిమళ్ నత్వానీ 28 ఓట్లతో గెలుపొందారు. అయితే, ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లకే పరిమితమై అనూహ్య ఓటమిని చవిచూశారు. కాగా, ఈ ఎన్నికల ఫలితాలను అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలగా, ఎన్డీయేకు అనూహ్యంగా అదృష్టం వరించింది. జార్ఖండ్ శాసనసభలో ఎన్డీయే కూటమికి కేవలం 24 మంది ఎమ్మెల్యేల (బీజేపీ 21, ఎల్జేపీ-రామ్ విలాస్ 1, ఏజేఎస్‌యూ 1, జేడీయూ 1) బలం మాత్రమే ఉంది. అయినప్పటికీ నత్వానీకి 28 ఓట్లు రావడం క్రాస్ ఓటింగ్ జరిగిందనడానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. మరోవైపు, అసెంబ్లీలో ఇండియా కూటమికి ఏకంగా 56 మంది ఎమ్మెల్యేల (జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 2) బలముంది.
తాజా విజయంతో పరిమళ్ నత్వానీ చరిత్రాత్మకంగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన స్వతంత్ర సభ్యుల్లో ఒకరిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. 2008 నుంచి 2020 వరకు జార్ఖండ్ నుంచి వరుసగా రెండు పర్యాయాలు స్వతంత్ర ఎంపీగా ఎన్నికైన ఆయన, ఆ తర్వాత 2020లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మళ్లీ జార్ఖండ్ నుంచి పెద్దల సభకు ఎన్నికవడం విశేషం. దీనిపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, రాజ్యసభకు నాలుగోసారి ఎన్నికైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2008లో తన పార్లమెంటరీ ప్రస్థానం జార్ఖండ్ నుంచే ప్రారంభమైందని, ఈ రాష్ట్రం నుంచి ఇప్పుడు మూడోసారి అవకాశం లభించడం తనకు భావోద్వేగ క్షణమని నత్వానీ పేర్కొన్నారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా సహ వ్యవస్థాపకుడు శిబు సోరెన్ మరణంతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ కాగా, బీజేపీ సభ్యుడు దీపక్ ప్రకాశ్ పదవీకాలం జూన్ 21వ తేదీతో ముగియనుండటంతో రెండో స్థానానికి తాజాగా ఈ ఎన్నికలను నిర్వహించారు.








