రాష్ట్రాన్ని ముంచేలా నిధుల నిష్పత్తి!
• ఉపాధి హామీ పాత విధానమే ముద్దు.
• ఢిల్లీ జాతీయ సదస్సులో కేంద్రానికి తెలంగాణ అభ్యంతరాలు.
• ఢిల్లీ వేదికగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.
ఢిల్లీ, మహా.
తెలంగాణ గ్రామీణాభివృద్ధి ప్రయోజనాలే పరమావధిగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గట్టిగా గళం విప్పారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు హాజరైన ఆమె, కేంద్రం ప్రవేశపెడుతున్న పలు పథకాల వల్ల రాష్ట్రాలపై పడుతున్న తీవ్ర ఆర్థిక భారాన్ని సోదాహరణంగా వివరించారు. ముఖ్యంగా ‘వీబీ జీ రామ్ జీ’ పథకంలోని నిధుల వాటాపై తెలంగాణకు ఉన్న తీవ్ర అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
**60:40 నిష్పత్తితో రాష్ట్రాలపై పెను భారం**
ప్రస్తుతం అమల్లో ఉన్న వీబీ జీ రామ్ జీ పథకంలో కేంద్రం నిర్దేశించిన 60:40 నిధుల విధానం తెలంగాణకు తీవ్ర నష్టదాయకంగా మారిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలా లేక దీని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొత్త పథకాన్ని తీసుకురావాలా అనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం పెడితే కేంద్రం నుంచి పైసా నిధులు రావని, 100 శాతం ఆర్థిక భారం రాష్ట్ర ఖజానాపైనే పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జులై 2న జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. కేంద్రం రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని తగ్గించినప్పుడే ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న ‘వికసిత్ గ్రామాలు–2047’ లక్ష్యం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆమె హితవు పలికారు.
**ఉపాధి హామీ పాత విధానమే ముద్దు.. ఇళ్లను వెంటనే కేటాయించండి**
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గతంలో ఉన్న 100 శాతం వేతనాల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్‌కు కేంద్రం తన 75 శాతం వాటాను కచ్చితంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తెస్తున్న కొత్త విధానాల వల్ల రాష్ట్రాలపై ఊహించని రీతిలో ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 100 రోజుల ఉపాధి కల్పనలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీఎం ఆవాస్ గృహాల కేటాయింపులను వద్దని తిరస్కరించిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఆ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతోందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా పన్నుల వాటా వెళ్తున్నప్పుడు, కేంద్ర పథకాలను కూడా అంతే స్థాయిలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
**రోడ్ల నిర్మాణానికి అటవీ అడ్డంకులు.. ‘జల్ సంచార్’లో అవార్డుల పంట**
పీఎంజీఎస్‌వై పథకం కింద గ్రామీణ రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ప్రధాన అడ్డంకిగా మారాయని మంత్రి సీతక్క వివరించారు. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను స్వయంగా కలిసి అటవీ క్లియరెన్స్‌లపై ప్రత్యేక వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని, రాష్ట్రంలో అధికారుల తరచూ బదిలీల వల్ల నివేదికలు సమర్పించడంలో కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. కేంద్ర నిధులు కోల్పోకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థవంతమైన పాలనకు నిదర్శనంగా ‘జల్ సంచార్’ విభాగంలో తెలంగాణకు ఏకంగా 13 జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని మంత్రి సీతక్క సగర్వంగా ప్రకటించారు.








