Mahaa Daily Exclusive

  డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో భారీ చుక్కెదురు….

Share

డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో భారీ చుక్కెదురు.
* బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.
* ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను కొట్టివేసిన మెజారిటీ ధర్మాసనం.
ఢిల్లీ, మహా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తీవ్ర భంగపాటు ఎదురైంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ప్రతిష్టాత్మక ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) హక్కును అమెరికా సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించింది. అమెరికా గడ్డపై చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న విదేశీ తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధ్యక్షుడు ట్రంప్ గతంలో జారీ చేసిన వివాదాస్పద కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అమెరికా సరిహద్దుల్లో జన్మించిన దాదాపు ప్రతి ఒక్కరికీ పుట్టుకతోనే అమెరికన్ పౌరసత్వం పొందే హక్కును కొనసాగించేలా 6-3 మెజారిటీతో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
అంతకుముందు, వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే క్రమంలో పౌరసత్వ అర్హతలపై ట్రంప్ విధించిన ఈ పరిమితులను అమెరికాలోని పలు కిందిస్థాయి న్యాయస్థానాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమంటూ దాని అమలుపై కింది కోర్టులు స్టే విధించాయి. అయితే, కింది కోర్టుల నిర్ణయాలను సవాలు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా సాగాయి.
మంగళవారం జరిగిన తుది విచారణలో కింది కోర్టుల తీర్పులతో ఏకీభవించిన సుప్రీంకోర్టు మెజారిటీ ధర్మాసనం.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని మరియు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని బెంచ్ ట్రంప్ ఉత్తర్వులను రద్దు చేస్తూ తుది తీర్పునిచ్చింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయులకు పౌరసత్వ పరంగా ఎదురవుతున్న పెద్ద ముప్పు తప్పినట్లయింది.