Mahaa Daily Exclusive

  వీడని ‘జ్ఞానేశ్వరి’ మిస్సింగ్ మిస్టరీ!

Share

వీడని ‘జ్ఞానేశ్వరి’ మిస్సింగ్ మిస్టరీ!
• చిన్నారి ఆచూకీ చెబితే లక్ష రూపాయల నజరానా!
• 25 రోజులుగా గాలింపు.
• తుని పోలీసుల కీలక ప్రకటన!
కాకినాడ (తుని):మహా.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల పసికూన జ్ఞానేశ్వరి అదృశ్యం వ్యవహారం అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఆడుకుంటూ వెళ్లిపోయిందా.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా.. అన్నది తేలక 25 రోజులుగా ఈ కేసు పోలీసులకు అతిపెద్ద సవాల్‌గా పరిణమించింది. ఎటుచూసినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ పసికందు కోసం గాలిస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తుని పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లేదా ఎవరికైనా అనుమానాస్పద సమాచారం తెలిస్తే తమకు వెంటనే అందించాలని, సరైన ఆధారాలు చూపిన వారికి రూ. లక్ష నగదు బహుమతి (రివార్డు) అందజేస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ మేరకు చిన్నారి ఫొటో, గుర్తింపు వివరాలతో కూడిన వాల్‌పోస్టర్లను పెద్ద ఎత్తున ముద్రించి విడుదల చేశారు. కేవలం కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాంతాలు, రద్దీ కూడళ్లలో ఈ పోస్టర్లను విస్తృతంగా అంటిస్తున్నారు. ఎవరికైనా పాప గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే 9440796508, 9440796531, 9440796573 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని తుని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ.. పాప అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 12 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించింది. సమీపంలోని అటవీ ప్రాంతాలతో పాటు వాగులు, వంకలను పోలీసులు అణువణువూ జల్లెడపట్టారు. అటవీ ప్రాంతంలో జీడిపిక్కలు ఏరుకునేందుకు పొరుగు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చేవారిని సైతం విచారించి, పాప వివరాలతో కూడిన కరపత్రాలను వారికి పంపిణీ చేసి అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఆ చిన్నారికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు కిడ్నాప్ కోణంలోనూ లోతుగా విచారణ చేపట్టారు. అయితే, ఎవరైనా ఎత్తుకెళ్లారనడానికి కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. కనీసం అడవి జంతువులు ఏమైనా దాడి చేశాయా అన్న కోణంలోనూ అన్వేషించారు. ఒక బొమ్మను, కొంత మాంసాన్ని సంఘటనా స్థలంలో ఉంచి వన్యప్రాణుల కదలికలను పసిగట్టే ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితమూ దక్కలేదు. జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో తన ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆ చిన్నారి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆ సమయంలో పాప వెంటే వెళ్లిన పెంపుడు శునకం కూడా కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ శునకం ఊరిలోని ప్రధాన రహదారిపై ఆందోళనగా అటూఇటూ తిరుగుతున్న దృశ్యాలు సమీపంలోని ఓ ఆలయ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఆ తర్వాత అది ఎటువైపు వెళ్లిందనే దానిపై ఎటువంటి స్పష్టతా రాలేదు. కొద్ది రోజులకు ఆ శునకం తిరిగి ఇంటికి చేరుకున్నప్పటికీ, దాని కదలికల ద్వారా పాప ఆచూకీని కనిపెట్టడం పోలీసులకు సాధ్యం కాలేదు. విషాదకరంగా ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ శునకం కూడా మృతి చెందింది. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఎన్ని విధాలుగా గాలించినా పాప జాడ దొరకకపోవడంతో, ఇక ప్రజల నుంచి అందే కీలక సమాచారం పైనే పోలీసులు ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.