Mahaa Daily Exclusive

  మేడ్చల్ డిపిఆర్ఓ వేధింపులు, కక్ష సాధింపు చర్యలపై ఐ అండ్ పిఆర్ కమిషనర్ కు ఫిర్యాదు…

Share

 

మేడ్చల్, జూలై 01 :

మేడ్చల్ మల్కాజిగిరి డిపిఆర్ఓ స్వర్ణలత విలేకరుల పట్ల కక్ష సాధింపు చర్యలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి, జాయింట్ డైరెక్టర్ జగన్ లకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ కమిటీ విషయంలో, అక్రిడిటేషన్ల జారీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కమిటీ నియామకంలో ఒక సామాజిక వర్గానికి, ఒక యూనియన్ కు అధిక ప్రాధాన్యతనిస్తూ కమిటీని నియమించారని వివరించారు. కమిటీ నియామకంపై అనేక దినపత్రికలలో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయని వారు తెలిపారు. ఈ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదే విధంగా అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో విలేకరులపై కక్ష సాధింపు చర్యలతో పాటు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. లేనిపోని నిబంధనల పేరుతో జర్నలిస్టులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని, ప్రభుత్వ ఉత్తర్వులు 252 ప్రకారమే “అర్హత ఉన్న పత్రికలు మాత్రమే వారి ప్రతినిధులను అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేయించారని వారు అన్నారు. ఇలాంటి వారికి సైతం అక్రిడిటేషన్ల ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంజూరైన అక్రిడిటేషలను సైతం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. బస్సు పాసులను సైతం అప్రూవ్ చేయకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వారు వివరించారు. కనీస పరిజ్ఞానం లేకుండా పత్రికలకు ప్రకటనలు జారీ చేయడం వల్ల జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తన లోపాలను ఎత్తి చూపిన వారిపై ద్వేషం పెంచుకొని కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వారు వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని అతిపెద్ద జిల్లాకు సమర్ధులైన డిపిఆర్ఓ ను నియమిస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రచారం లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాలపై విచారణ జరిపి డిపిఆర్ఓ పై తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మెరుగు చంద్రమోహన్, బెలిదే అశోక్ గుప్తా, ముత్యం ముఖేష్ గౌడ్, వాసు కుమార్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.