Mahaa Daily Exclusive

  రేషన్ కార్డుదారులకు పండుగే…

Share

రేషన్ కార్డుదారులకు పండుగే.
* ఇకపై ప్రతీ నెలా సన్న బియ్యం.
* రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.
* నేటి నుంచే పంపిణీ షురూ.
* 3.41 కోట్ల మందికి లబ్ధి.
* పారదర్శకంగా రేషన్ పంపిణీకి అధికారుల ఆదేశాలు!హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు, రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. ఆహార భద్రత పథకంలో భాగంగా పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గత కొంతకాలంగా ప్రతి మూడు నెలలకు ఒకేసారి అందిస్తున్న బియ్యం కోటా విధానానికి స్వస్తి పలికి, జులై మాసం నుంచి యథాతథంగా ప్రతి నెలా పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది.
జులై నెలకు సంబంధించిన సన్న బియ్యం కోటాను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1.06 కోట్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. మొత్తం 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు సరిపడా ఏకంగా 2.15 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ఈ నెలలో పంపిణీ చేయనుంది. ఇందుకు అవసరమైన 2.15 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను మండల స్థాయిలోని స్టాక్ పాయింట్ల నుంచి గ్రామస్థాయిలోని రేషన్ దుకాణాలకు అధికారులు ముందుగానే తరలించి అందుబాటులో ఉంచారు. వాస్తవానికి గతంలో యాసంగి ధాన్యం రాకతో గోదాముల్లో భారీగా నిల్వలు పెరిగిపోయి స్థలాభావ సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో ఒకేసారి మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలిగిపోవడంతో ప్రభుత్వం తిరిగి నెలవారీ కోటా పంపిణీకి శ్రీకారం చుట్టింది.
ఈ సన్న బియ్యం పంపిణీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను కఠినంగా ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మాత్రమే బియ్యం అందజేయాలని స్పష్టం చేశారు. అలాగే డిజిటల్ లావాదేవీలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో రేషన్ దుకాణాల వద్ద జరుగుతున్న పంపిణీ విధానాన్ని పర్యవేక్షించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నెలనెలా రేషన్ బియ్యం అందుబాటులోకి వస్తుండటంతో సామాన్య ప్రజలు, కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.