పచ్చని ఏపీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
* 18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
అమరావతి, మహా.
రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, సవిత తదితరులు కూడా వర్చువల్‌గా పాలుపంచుకున్నారు. నగర వనాలు పట్టణ ప్రాంతాలకు గ్రీన్ లంగ్స్‌లా (ఊపిరితిత్తుల్లా) పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మన వారసత్వం అంటే కేవలం మనం నిర్మించిన రాతి కట్టడాలు మాత్రమే కాదని, భావితరాల కోసం మనం సజీవంగా కాపాడిన ప్రకృతి కూడా మన వారసత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ పథకం నిధులతో పాటు స్థానిక నిధులను సైతం సమర్థవంతంగా వినియోగిస్తూ మొత్తం రూ.36 కోట్ల వ్యయంతో ఈ 18 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పర్యావరణాన్ని కాపాడే క్రమంలో ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల సువిశాల విస్తీర్ణంలో, దాదాపు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పార్కుల్లో ప్రకృతి అందాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొడూరు, కైలాసగిరి, మదనపల్లె తదితర ప్రాంతాలలో అత్యంత అరుదైన ఎర్రచందనం వృక్షాల పరిరక్షణ కోసం ప్రత్యేక పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నక్షత్ర వనాలు, రాశి వనాలను సైతం అభివృద్ధి చేశారు. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్ పాయింట్లతో పాటు.. ఆరోగ్యం కోసం యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు వంటి ఆధునిక సౌకర్యాలను కల్పించారు. ఇవి కేవలం పచ్చదనాన్ని పెంచడానికే పరిమితం కాకుండా, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడూ బాధ్యతగా ఈ నగర వనాలను పరిరక్షిస్తూ, మరింత పచ్చని, పరిశుభ్రమైన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.








