Mahaa Daily Exclusive

  తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం..! బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్‌లపై కత్తెర..

Share

  •  భద్రతా ఏర్పాట్లలో భారీ మార్పులు.
  •  బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్‌లపై కత్తెర.
  •  మాజీ ఉన్నతాధికారులకు సెక్యూరిటీ కోత.
  •  గన్‌మెన్ల సంఖ్య తగ్గించిన తెలంగాణ పోలీసులు.

హైదరాబాద్, మహా.

తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత భద్రతా అవసరాలు, ముప్పు అంచనాల ఆధారంగా పలువురు మాజీ పోలీసు ఉన్నతాధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షిస్తూ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలు, గన్‌మెన్ల సంఖ్యలో కోత విధించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల భద్రతా వాహనాల ఉపసంహరణ అంశం న్యాయస్థానంలోనూ చర్చకు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల ఉపసంహరణ

 

పోలీస్ శాఖ తాజా సమీక్షలో భాగంగా పదవీ విరమణ చేసిన కొంతమంది మాజీ డీజీపీలు, మాజీ పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటివరకు కొనసాగుతున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు మాజీ అధికారుల భద్రతా ఏర్పాట్లను కూడా తాజా ముప్పు అంచనాల ప్రకారం పునఃపరిశీలిస్తున్నట్లు సమాచారం.

 

ఎస్కార్ట్ వాహనాలపై కూడా నిర్ణయం

 

మాజీ డీజీపీలకు కేటాయించిన ఎస్కార్ట్ వాహనాలను కూడా తొలగించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది ప్రస్తుత అధికారులకు అందిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల కేటాయింపును కూడా సమీక్షించి అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు సమాచారం.

 

గన్‌మెన్ల సంఖ్య తగ్గింపు

 

పలువురు రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, ఇతర వీఐపీలకు అందిస్తున్న వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. గతంలో కేటాయించిన అధిక సంఖ్యలో గన్‌మెన్ల స్థానంలో ప్రస్తుతం చాలా మందికి ఒకరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఒకరు సహాయక భద్రతా సిబ్బంది ఉండే విధంగా భద్రతను పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

 

ముప్పు అంచనాల ఆధారంగానే నిర్ణయాలు

 

పోలీస్ శాఖ తాజా భద్రతా సమీక్షలో ప్రతి వ్యక్తికి ఉన్న ముప్పు స్థాయిని పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భద్రతా వనరులను సమర్థవంతంగా వినియోగించడం, వాస్తవ అవసరాలు ఉన్న వారికి ప్రాధాన్యం కల్పించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

 

న్యాయపరమైన పరిణామాలు కూడా చర్చనీయాంశం

 

ఇదిలా ఉండగా, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌కు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తదుపరి విచారణ వరకు వాహనాన్ని కొనసాగించాలని ఆదేశించింది.