ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ.
* ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అభ్యంతరం.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సరైన నిబంధనలు పాటించకుండా, నిర్దిష్టమైన ప్రక్రియను అనుసరించకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్లను జాబితా నుంచి అన్యాయంగా తొలగిస్తున్నారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఎన్నికల సంఘం ఏకపక్ష తీరుపై ఆయన పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఒవైసీ తరఫున సీనియర్ న్యాయవాది నిజాముద్దీన్ పాషా అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన ఫారం-6 దరఖాస్తులకు సంబంధించి ఎన్నికల సంఘం విధించిన మ్యాపింగ్ తదితర క్లిష్టమైన నిబంధనలు సామాన్య ఓటర్లకు తీవ్ర భారంగా పరిణమించాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి తమ పిటిషన్ను కూడా గురువారం నాటి విచారణకు స్వీకరించాలని ధర్మాసనాన్ని న్యాయవాది కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం, సంబంధిత కేసులతో కలిపి విచారణ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
ఓటర్ల జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా పేర్ల గల్లంతు కావడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖ విపక్ష నేతలు సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు అదే బాటలో ఎంఐఎం అధినేత కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రేపు ఉమ్మడిగా విచారించే అవకాశం ఉంది.






