ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ ముప్పు.
* జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.
ఢిల్లీ, మహా.
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి (AI2030) హైజాక్ హెచ్చరిక రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. విమానం ముంబై ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ మీదుగా ప్రయాణిస్తుండగా పైలట్ అత్యవసరంగా ‘స్క్వాక్ కోడ్ 7500’ను యాక్టివేట్ చేశారు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం విమానం హైజాక్కు గురైనప్పుడు లేదా చట్టవిరుద్ధ జోక్యం జరిగినప్పుడు మాత్రమే పైలట్లు ఈ కోడ్ను వాడతారు. దీంతో అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా ఈ అత్యవసర సిగ్నల్ అందుకున్న అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
వెంటనే భద్రతా అధికారులు ఆ విమానాన్ని రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. ఉదయం 9:35 గంటలకు విమానం జైపూర్లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, ముందు జాగ్రత్త చర్యగా దానిని ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి తనిఖీలు చేపట్టారు.
విమానాశ్రయ సెక్యూరిటీతో పాటు సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం తదితర భద్రతా సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రయాణికుల లగేజీతో పాటు విమానంలోని ప్రతి అణువునూ పరిశీలిస్తున్నారు. అయితే బాంబు బెదిరింపులు ఉన్నాయా లేదా పైలట్ ఎందుకిలాంటి అత్యవసర కోడ్ను పంపారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.







