సీజేపీ నేతల అరెస్టుపై భగ్గుమన్న రాహుల్.
• నిరసనకారులను జైలులో పెట్టడం పిరికిపంద చర్య.
• జంతర్‌మంతర్‌ను తిరిగి ప్రజల వేదికగా మారుస్తాం.
న్యూఢిల్లీ, మహా .
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ జెండా చేతబూని నిరసన గళం వినిపిస్తున్న యువతను జైలుపాలు చేయడం పాలకుల పిరికిపంద చర్యకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ఇండియా కూటమి నేతలు.. ఇలా ఎవరి జెండాలు, బ్యానర్లు వేరైనా వారందరి లక్ష్యం మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. పౌరులంతా తమకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసమే గళమెత్తుతున్నారని పేర్కొన్నారు. జంతర్‌మంతర్ దేశ ప్రజలందరి ఆస్తి అని, పాలకుల ఆంక్షలను బద్దలుకొట్టి దానిని తిరిగి ప్రజల స్వేచ్ఛా నిరసన వేదికగా మారుస్తామని రాహుల్ ఉద్ఘాటించారు.
ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ ప్రక్రియలకు వ్యతిరేకంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నేతలు ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు అనుమతి లేకుండా జంతర్‌మంతర్ పరిసరాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలతో పాటు అజింక్య షిండేను మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం బుధవారం ఉదయం వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. నిందితులు ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా వ్యవహరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం సౌరవ్ దాస్, అశుతోష్‌లకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు వారిని తీహార్ జైలుకు తరలించారు. మరో నేత అజింక్య షిండేకు మాత్రం ఐదు వేల రూపాయల పూచీకత్తుపై న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏడాది పాటు ప్రజాశాంతికి భంగం కలిగించే ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని ఆయనకు స్పష్టమైన షరతు విధించింది.






