Mahaa Daily Exclusive

  తెలంగాణ అప్పులపై నేను చెప్పింది తప్పయితే – రాజీనామా చేసేందుకు సిద్ధం : మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

Share

తెలంగాణ అప్పులపై నేను చెప్పింది తప్పయితే

– రాజీనామా చేసేందుకు సిద్ధం

– మా ఆరోపణలపై కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు?

మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

– ఉదయం నుండి సాయంత్రం దాకా హైడ్రామా

– హరీష్ రావు అరెస్ట్.. గన్ పార్క్ వద్ద మంత్రుల ప్రెస్ మీట్లు

– సీఎం, మంత్రులు తొడగొట్టి తోకముడిచారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మహా
తెలంగాణ రాష్ట్ర అప్పులపై బుధవారం తాను చెప్పిన అంకెలు తప్పయితే రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. తన వద్ద అప్పులకు సంబంధించి అన్ని రికార్డులూ ఉన్నాయని, బీఆర్​ఎస్​ నేతలు చర్చకు రావాలని మరోసారి సవాల్​ విసిరారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఇంకా బుకాయిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతున్నామన్న ఆయన, దీనిపై మాజీ సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తన మాట అబద్ధమైతే కేసీఆర్‌తో అప్పుల విషయంపై మాట్లాడాలని కోరుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. పదేళ్లపాటు మీరు చేసిన అప్పుల గురించి కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులను మీడియాకు చెప్పాలన్న ఆయన బీఆర్ఎస్ చేసిన అప్పు కళ్లకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని పేర్కొన్నారు. కార్పొరేషన్‌ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టామని చెబుతున్నారని దానికి చేసిన అప్పును రైతుల నుంచి వసూలు చేస్తారా? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఒక్కో రైతు నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. తాను చెప్పిన అంకెలు తప్పయితే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.

హరీష్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత

తెలంగాణలో గురుకులాల టెండర్లు, రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ పాలన అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు గురువారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బహిరంగ చర్చకు వెళ్తున్నామని ప్రకటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తెలంగాణ భవన్ వద్దే అడ్డుకోవడం, అనంతరం వారిని అదుపులోకి తీసుకుని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం రోజంతా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. విడుదల అనంతరం మీడియా సమావేశంలో హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పలు అంశాలపై విస్తృత ఆరోపణలు చేశారు. అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరిన హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో హరీశ్‌రావు కిందపడిపోయిన ఘటన ఉద్రిక్తతను మరింత పెంచింది. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

సీఎం, మంత్రులు తొడగొట్టి తోకముడిచారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అప్పులపై చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తీరా సమయం వచ్చేసరికి తోకముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సవాల్ విసిరి చేతకాక పారిపోయిన వీరి బాగోతాన్ని రాష్ట్ర ప్రజలంతా కళ్లారా చూశారని మండిపడ్డారు. తానే స్వయంగా తెలంగాణ భవన్‌కు వస్తున్నానని ప్రగల్బాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి, శాలువాతో మూడు గంటలపాటు వేచి చూసినా రాలేదని అన్నారు. మంత్రి రాకుండా మొహం చాటేయడంతోపాటు మరో చోట డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధమై బయలుదేరిన హరీశ్‌రావును, ఇతర నేతల్ని అరెస్టు చేయడం, మమ్ములను అడుగడుగునా అడ్డుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం, ఇక్కడ పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన నేతలను పరామర్శించేందుకు కూడా వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో చర్చించే దమ్ము ఈ పిరికిపందలకు లేదని అన్నారు.

Latest