Mahaa Daily Exclusive

  దేశాన్ని కమ్మేస్తున్న వానలు..! పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక..

Share

హైదరాబాద్, మహా.

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో పాటు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉండగా, పలు రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని పేర్కొంది. తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది.

 

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

 

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రానున్న వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, తెలంగాణ, రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

 

మత్స్యకారులకు హైఅలర్ట్

 

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గుజరాత్, కొంకణ్, గోవా, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. తీరప్రాంత ప్రజలు అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.

 

వరదలు, కొండచరియల ప్రమాదం

 

వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం, చురుకైన రుతుపవన ద్రోణి, పశ్చిమ తీరం వెంబడి కొనసాగుతున్న వాతావరణ వ్యవస్థల ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలు కురిసిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం అధికంగా ఉందని హెచ్చరించింది.

 

పలు రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరిక

 

దిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో జులై 3 నుంచి 5 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.

 

వర్షాలు పడుతున్నా ఉక్కపోత ఎందుకు?

 

వర్షాలు కురుస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు సముద్రాల నుంచి అధిక తేమను తీసుకురావడంతో గాలిలో తేమ శాతం పెరుగుతోంది. కొద్దిసేపు వర్షం కురిసిన తర్వాత ఎండ రావడం వల్ల నేలపైని తేమ ఆవిరై గాలిలో తేమ మరింత పెరుగుతోంది. అలాగే రాత్రిపూట మేఘావృత వాతావరణం వల్ల భూమి నుంచి వేడి బయటకు వెళ్లకుండా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదని వివరించారు. దీంతో వర్షాలు కురిసినా అనేక ప్రాంతాల్లో ఉక్కపోత కొనసాగుతోందని పేర్కొన్నారు.

Latest