ఢిల్లీ, మహా.
భారత్, జపాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు కేవలం దౌత్య, అధికారిక చర్చలకే పరిమితం కాకుండా నూతన శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఇరు దేశాల అధినేతల మధ్య నెలకొన్న బలమైన వ్యక్తిగత అనుబంధానికి నిదర్శనంగా దిల్లీ వేదికగా ఒక అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆత్మీయంగా ‘చిన్న చెల్లెలు’ అని సంబోధించారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా జరిగిన 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఈ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది.
**అన్నగా భావించా..**
ఈ ప్రతిష్ఠాత్మక సమావేశంలో జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయ్ తకాయిచి మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని షింజో అబేను తాను సొంత అన్నయ్యలా భావించేదాన్నని గుర్తుచేసుకున్నారు. అబేకు ప్రధాని మోదీ అత్యంత సన్నిహితులు కావడంతో, తానూ మోదీని అదే దృష్టితో చూస్తున్నానని ఆమె సభాముఖంగా వెల్లడించారు. తకాయిచి మాటలకు ప్రధాని మోదీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ.. ఆమెను తన ‘చిన్న చెల్లెలు’గా సంబోధించారు. ఈ ఆత్మీయ అనుబంధం, పరస్పర గౌరవంతోనే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతామని ఇరు దేశాల నేతలు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తకాయిచి భారత్‌లో జరిపిన మొట్టమొదటి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం. ఈ సదస్సు ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక నూతన అధ్యాయానికి నాంది అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
**చరిత్రాత్మక ఒప్పందాలు..**
ఈ శిఖరాగ్ర పర్యటనలో భాగంగా భారత్, జపాన్ దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త అభివృద్ధి కోసం ఇరు దేశాలు తొలిసారిగా ఒక ప్రత్యేక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆర్థిక, ఇంధన భద్రతపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించడంతో పాటు, రానున్న పదేళ్ల కాలంలో జపాన్ నుంచి ఏకంగా 10 ట్రిలియన్ యెన్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల తయారీ, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపైనా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమత్వంతో పాటు పటిష్ఠమైన నియమ నిబంధనలతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని అధినేతలు పునరుద్ఘాటించారు.







