Mahaa Daily Exclusive

  మరింత పటిష్ఠంగా భారత రక్షణ వ్యవస్థ..! రూ. 52 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్‌ సిగ్నల్‌..

Share

  •  రూ. 52 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్‌ సిగ్నల్‌.
  •  రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలో కీలక నిర్ణయాలు.

ఢిల్లీ, మహా.

భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో త్రివిధ దళాలకు అవసరమైన ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేందుకు ఆమోదముద్ర పడింది. సుమారు రూ. 52 వేల కోట్ల భారీ అంచనా విలువైన ఈ రక్షణ సామాగ్రి కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో సైన్యం, నౌకాదళం, వాయుసేనల అమ్ములపొదిలోకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక అస్త్రశస్త్రాలు చేరనున్నాయి.

**సైన్యానికి ‘ఆకాశ్‌ తరంగ్‌’.. కమికాజే డ్రోన్లు**

దేశ సరిహద్దుల్లో శత్రువుల ఆటకట్టించేందుకు భారత పదాతిదళానికి ఎంతో అవసరమైన పలు ఆధునిక వ్యవస్థల కొనుగోలుకు తాజా సమావేశంలో అనుమతి లభించింది. ముఖ్యంగా అదృశ్య తరంగాలతో శత్రు డ్రోన్లను కూల్చేసే యాంటీ డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థ అయిన ‘ఆకాశ్ తరంగ్’ను సైన్యానికి అందించనున్నారు. దీనితో పాటు సులభంగా మోసుకెళ్లే (మ్యాన్ పోర్టబుల్) యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థలు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలుకు డీఏసీ పచ్చజెండా ఊపింది. సైనిక ట్యాంకుల భద్రత కోసం యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్‌తో పాటు, లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మాహుతి దాడులకు దిగే జెట్ ఆధారిత కమికాజే డ్రోన్ వ్యవస్థల కొనుగోలుకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

**సముద్ర నిఘాకు సరికొత్త రెక్కలు**

సముద్ర జలాల్లో నిఘా పెంచడంతో పాటు తీరప్రాంత రక్షణను మరింత పటిష్ఠం చేసేందుకు నౌకాదళానికి కొత్త అస్త్రాలు అందనున్నాయి. శత్రు జలాంతర్గాములు, నౌకల కదలికలను సముద్ర గర్భంలోనే తుదముట్టించేందుకు వీలుగా మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్‌ను సమకూర్చుకోనున్నారు. అలాగే, యుద్ధ నౌకల పైనుంచి నేరుగా ప్రయోగించే అత్యాధునిక మానవరహిత వైమానిక వ్యవస్థల (డ్రోన్ల) కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భవిష్యత్తు నౌకాదళ అవసరాల దృష్ట్యా అత్యాధునిక ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థల పరీక్షా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

**వాయుసేన కోసం సూడో శాటిలైట్‌**

గగనతలంలో శత్రువుల కదలికలపై డేగ కన్ను వేసేందుకు వీలుగా భారత వాయుసేన (ఐఏఎఫ్‌) కోసం ‘ఫిక్స్‌డ్ వింగ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్’ను కొనుగోలు చేయాలని డీఏసీ నిర్ణయించింది. దీని ద్వారా అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో దీర్ఘకాలిక నిఘా, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలు వాయుసేనకు మరింతగా బలోపేతం కానున్నాయి. తాజా కొనుగోళ్లతో మూడు దళాల యుద్ధ సన్నద్ధత శిఖరాగ్రానికి చేరుతుందని, సరిహద్దుల భద్రతతో పాటు ఆధునిక సాంకేతిక సామర్థ్యాలు మునుపెన్నడూ లేని స్థాయిలో రెట్టింపు అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

Latest