Mahaa Daily Exclusive

  ఈడీ చరిత్రలో తొలిసారి..! ఈ-వేలంలో విమానం విక్రయం..

Share

  • ఈ-వేలంలో విమానం విక్రయం.
  •  ఫాల్కన్‌ పోంజీ కుంభకోణంలో జప్తు చేసిన ఈడీ.

హైదరాబాద్, మహా.

ఆర్థిక నేరగాళ్లపై కొరడా ఝుళిపించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చరిత్రలో దేశంలోనే తొలిసారిగా ఓ సరికొత్త ఘట్టం చోటుచేసుకుంది. తాము జప్తు చేసిన ఒక విమానాన్ని ఈడీ అధికారులు మొట్టమొదటిసారిగా ఈ-వేలం ద్వారా విక్రయించారు. ఫాల్కన్ పోంజీ కుంభకోణం కేసులో హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘హాకర్‌ 800A’ విమానాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా ఈ నెల 1న ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఈ ప్రక్రియలో సదరు విమానం రూ. 3 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం.

**బాధితులకు ఆ సొమ్ము..**

ఈ హాకర్ 800ఏ విమానం ఫాల్కన్ పోంజీ కేసులో ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ కుమార్‌కు చెందింది. నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అమర్‌దీప్‌ ఏకంగా రూ. 792 కోట్ల భారీ మోసానికి పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అందులో భాగంగానే గత మార్చి 7న ఈ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసి, పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత దీనిని ఈ-వేలంలో ఉంచారు. విక్రయం ద్వారా వచ్చిన రూ. 3 కోట్లను మోసపోయిన బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, లోతైన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

పారదర్శకత కోసమే ఈ విధానం

ఒక దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న విమానాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో విక్రయించడం బహుశా దేశంలో ఇదే ప్రథమం. జప్తు చేసిన ఆస్తుల విక్రయ ప్రక్రియలో అత్యున్నత పారదర్శకతను తీసుకురావడంతో పాటు, కొనుగోలుదారుల మధ్య పోటీ వాతావరణం కల్పించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ఈ ఈ-వేలం విధానం ఎంతగానో ఉపయుక్తమవుతుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా పారదర్శక విధానాలను అవలంబించనున్నట్లు తెలుస్తోంది.

Latest